ఓఐసీ సదస్సుకు భారత్‌

24 Feb, 2019 02:11 IST|Sakshi

ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించిన యూఏఈ

న్యూఢిల్లీ: ముస్లిం ప్రధాన దేశాల కూటమి ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌(ఓఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనాలని భారత్‌ను యూఏఈ ఆహ్వానించింది. మార్చి 1, 2 తేదీల్లో దుబాయ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఓఐసీ సమావేశానికి భారత్‌ను ముఖ్య అతిథిగా  ఆహ్వానించడం ఇదే తొలిసారి. భారత్‌లో నివసిస్తున్న సుమారు 18 కోట్ల మంది ముస్లింలు, దేశ బహుళత్వం, వైవిధ్య పరిరక్షణలో వారి పాత్రను గుర్తిస్తూ ఓఐసీ ఈ ఆహ్వానం పంపింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్‌ను ఏకాకిని చేయాలని భారత్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.  కశ్మీర్‌ విషయంలో ఓఐసీ మొదటి నుంచి పాక్‌ వైపే మాట్లాడుతోంది. ఐఓసీలో సభ్యురాలిగా చేరేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను పాక్‌ అడ్డుకుంటోంది. ఇప్పుడు ఐఓసీ భారత్‌ను ఆహ్వానించడం చరిత్రాత్మకమని మాజీ దౌత్యవేత్త తల్మిజ్‌ అహ్మద్‌ అన్నారు. 

సంబరపడొద్దు: కాంగ్రెస్‌ 
ఓఐసీ ఆహ్వానాన్ని మన్నించి భారత్‌ సంబరపడటం సరికాదని కాంగ్రెస్‌ సూచించింది. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇదొక విఫల ప్రయత్నమని పేర్కొంది. భారత్‌ను పూర్తిస్థాయి సభ్యురాలిగా చేర్చుకునేంత వరకు ఓఐసీ సమావేశాలకు హాజరుకావొద్దని గతంలో నిర్దేశించుకున్న వైఖరిని ప్రభుత్వం కొనసాగించాలని కోరింది.  

మరిన్ని వార్తలు