భారత్‌ హిందువులదే: శివసేన

30 Oct, 2017 15:07 IST|Sakshi

సాక్షి, ముంబై: శివసేన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత్‌ తొలుత హిందూ దేశమేనని స్పష్టం చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చెప్పినట్టు భారత్‌ హిందువుల మాదిరిగా అందరిదీ అని, అయితే తొలుత ఇది హిందూ దేశమని, ఆ తర్వాతే ఇతరులని పార్టీ పత్రిక సామ్నా పత్రిక సంపాదకీయం పేర్కొంది. ముస్లింలకు 50కి పైగా దేశాలున్నాయని, అందుకే భారత్‌ ముందుగా హిందువులదేనని వ్యాఖ్యానించింది. క్రైస్తవులకు అమెరికా, యూరప్‌ దేశాలు, బౌద్ధులకు చైనా, జపాన్‌, శ్రీలంక, మయన్మార్‌ వంటి దేశాలుండగా, హిందువులకు భారత్‌ మినహా మరో దేశం లేదని పేర్కొంది.

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌పైనా శివసేన మండిపడింది. కేంద్రంలో హిందుత్వ అనుకూల ప్రభుత్వమున్నా అయోధ్యలో రామాలయ నిర్మాణం, కశ్మీరీ పండిట్ల వ్యవహారం ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రామ మందిర నిర్మాణాన్ని చేపట్టకుండా న్యాయస్ధానానికి వదిలివేశారని ఆరోపించింది.

జాతీయ గీతం ఆలపించే సమయంలో లేచి నిలబడాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాన్ని కొందరు వ్యతిరేకిస్తున్న తీరును ప్రస్తావిస్తూ దీనిపై కేంద్రం వైఖరి ఏమిటని సామ్నా సంపాదకీయంలో శివసేన నిలదీసింది. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో, మహారాష్ర్టలో బీజేపీ సర్కార్‌లో భాగస్వామిగా ఉన్న శివసేన ఇటీవల పలు అంశాలపై మోదీ సర్కార్‌తో విభేదిస్తోంది.

మరిన్ని వార్తలు