గగనతల పటిష్టతకు కేంద్రం చర్యలు

30 Jul, 2018 08:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ముంబై, ఢిల్లీలతోపాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గగన తలాన్ని మరింత పటిష్టపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే వైమానిక రక్షణ వ్వవస్థకు అవసరమైన క్షిపణులు, లాంచర్లు, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ యూనిట్లను అమెరికా, రష్యా, ఇజ్రాయిల్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అలాగే దీనిలో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నట్లు మిలటరీ వర్గాలు వెల్లడించాయి. గత కొన్నేళ్లుగా డ్రాగన్‌ కంట్రీ చైనా వైమానిక శక్తిని గణనీయంగా పెంచుకుందని.. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా గగన తలాన్ని పటిష్టపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకుందని ఆ వర్గాలు వివరించాయి.

వైమానిక పటిష్టతకు అవసరమైన రాడార్లు, క్షిపణులు, డ్రోన్స్, యుద్ధ విమానాలను కొనుగొలు చేసేందుకు అమెరికాతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే సుమారు 2 బిలియన్ల డాలర్ల విలువ గల సముద్ర పరిరక్షణ డ్రోన్లను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో సభ్యత్వం లేని దేశానికి డ్రోన్లను విక్రయించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతోపాటు సుమారు రూ.40 వేల కోట్లతో రష్యా నుంచి ఎస్‌–400 ట్రియాంప్‌ వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలను కొనుగొలుకు సంబంధించిన ఒప్పందం తుది చర్చల్లో ఉంది. అలాగే 5 వేల కిలోమీటర్ల లక్ష్యాలను చేదించగల ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని 5ను కూడా త్వరలోనే ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు