‘చైనాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి’

29 May, 2020 05:58 IST|Sakshi

న్యూఢిల్లీ:  చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపై భారత్‌ స్పందించింది. చైనాతో మిలటరీ స్థాయిలో, దౌత్య మార్గాల్లో వివాద పరిష్కార ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. అయితే, దేశ రక్షణ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో రాజీ లేదని తేల్చి చెప్పింది. ‘శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం’ అని విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గురువారం ఆన్‌లైన్‌ మీడియా భేటీలో వ్యాఖ్యానించారు. చైనాతో సరిహద్దుగా భావిస్తున్న వాస్తవాధీన రేఖ వెంట శాంతి, సామరస్యతలను నెలకొల్పే బాధ్యతకు భారత్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

సరిహద్దుల నిర్వహణ విషయంలో భారత దళాలు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయన్నారు. భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనపై శ్రీవాస్తవ స్పందించలేదు. ఈ ప్రతిపాదన అమెరికా వైపు నుంచి భారత్‌కు వచ్చిందా?, ఒకవేళ వస్తే.. భారత్‌ ఏమని సమాధానమిచ్చింది? చైనాతో ప్రస్తుతం నెలకొన్న వివాదంపై అమెరికాకు భారత్‌ సమాచారమిచ్చిందా?.. తదితర ప్రశ్నలకు ఆయన జవాబు దాటవేశారు. 

>
మరిన్ని వార్తలు