భారత్, చైనాల ‘సరిహద్దు’ చర్చలు

23 Dec, 2017 01:30 IST|Sakshi
చైనా ప్రత్యేక ప్రతినిధి యాంగ్‌తో దోవల్‌ కరచాలనం

న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య 20వ దఫా సరిహద్దు చర్చలు శుక్రవారం జరిగాయి. ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య పరస్పరం విశ్వాసం పెంపొందించే చర్యలపైనే ప్రధానంగా చర్చించారు. సరిహద్దు అంశంపై తుది తీర్మానానికి రాలేకపోయామని ఉభయ పక్షాలు అంగీకరించాయి. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని, ఈ మేరకు అమలుచేయాల్సిన చర్యలపై ఆలోచనలను పంచుకున్నట్లు వెల్లడించాయి. చర్చల్లో వివాదాస్పద అంశమైన డోక్లాం ప్రస్తావన రాకపోవడం గమనార్హం. రోజంతా సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, చైనా స్టేట్‌ కౌన్సెలర్‌ యంగ్‌ జీచితోపాటు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

చర్చలపై చైనా విదేశాంగ ప్రతినిధి స్పందిస్తూ ‘ఇది సరిహద్దు అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశం మాత్రమే కాదు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సమాచార మార్పిడికి సంబంధించిన ప్రధాన వేదిక కూడా’ అని అన్నారు. దోవల్, యంగ్‌ ఇద్దరూ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చర్చల సారాంశాన్ని వివరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇండియా, చైనా మధ్య బలమైన సంబంధాలు ఉండటం ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనకరమని, ఇది ప్రాంతీయంగా, అంతర్జాతీయంగానూ సత్ఫలితాలు ఇస్తుందని అభిప్రాయపడినట్లు భారత విదేశీ శాఖ వెల్లడించింది. భారత్, చైనా మధ్య జూన్‌ 16న తలెత్తిన డోక్లాం వివాదం ఆగస్టు 28న పరస్పర ఒప్పందంతో సమసింది. భూటాన్‌ సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ రహదారి నిర్మించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం అడ్డుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య రెండున్నర నెలలకు పైగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.    

మరిన్ని వార్తలు