వేగంగా బలగాలు వెనక్కి

25 Jun, 2020 04:49 IST|Sakshi

జూన్‌ 6న కుదిరిన ఒప్పందాన్ని త్వరగా అమలు చేయాలి

ఎల్‌ఏసీని గౌరవించాలి; భారత్, చైనా నిర్ణయం

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక సరిహద్దు ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించడానికి సంబంధించి జూన్‌ 6న ఇరుదేశాల సైన్యాధికారుల మధ్య కుదిరిన ఒప్పందాల అమలును వేగవంతం చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. తద్వారా సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొంటాయని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను రెండు దేశాలు విధిగా గౌరవించాలని నిర్ణయించినట్లు తెలిపింది. భారత్, చైనా బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నతస్థాయి దౌత్య చర్చలు జరిపాయి.

ఈ చర్చల్లో భారత్‌ తరఫు విదేశాంగ శాఖలోని తూర్పు ఆసియా వ్యవహారాల సంయుక్త కార్యదర్శి నవీన్‌ శ్రీవాస్తవ, చైనా తరఫున ఆ దేశ విదేశాంగ శాఖలోని డైరెక్టర్‌ జనరల్‌ వూ జియాంఘావో పాల్గొన్నారు. దౌత్య, మిలటరీ మార్గాల్లో సంప్రదింపులను కొనసాగించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ చర్చల్లో తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో పరిస్థితిని విపులంగా చర్చించారని, గల్వాన్‌ లోయలో జూన్‌ 15న జరిగిన హింసాత్మక ఘర్షణల విషయమై భారత్, చైనాను నిలదీసిందని వెల్లడించింది. అయితే, ఒక వైపు చర్చలు సాగిస్తూనే, మరోవైపు, తూర్పు లద్దాఖ్‌తో పాటు సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లోని ఎల్‌ఏసీ వెంబడి ఉన్న కీలక ప్రాంతాలకు మరిన్ని బలగాలకు చైనా పంపిస్తుండటం గమనార్హం.

చైనా నోట మళ్లీ అదే మాట..
గల్వాన్‌లో ఇరుదేశాల సైనికులు మృతి చెందడానికి భారత్‌దే బాధ్యత అని చైనా మరోసారి వ్యాఖ్యానించింది. చైనా రక్షణ, విదేశాంగ శాఖల అధికారులు బుధవారం వేర్వేరుగా ఇదే విషయాన్ని వక్కాణించారు. భారత్, చైనాలు ముఖ్యమైన పొరుగు దేశాలని, ప్రస్తుత సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు కృషి చేయాలని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వూ క్వియాన్‌ పేర్కొన్నారు. జూన్‌ 15 నాటి గల్వాన్‌ లోయ ఘర్షణకు భారత దేశమే కారణమని, భారత సైనికులు రెచ్చగొట్టడం వల్లనే ఆ ఘర్షణలు జరిగాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ అన్నారు. భారత విదేశాంగ శాఖ, భారత మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేయడంపై మీడియా ప్రశ్నించగా.. తాను వాస్తవాలు చెబుతున్నానన్నారు.

ఆర్మీ చీఫ్‌ పర్యటన
తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుకు సమీపంగా ఉన్న సైనిక కేంద్రాలను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె బుధవారం సందర్శించారు. చైనాతో ఇటీవలి ఘర్షణల సమయంలో అత్యంత ధైర్య సాహసాలు చూపిన ఐదుగురు సైనికులకు ప్రశంసాపూర్వక బ్యాడ్జెస్‌ను అందించారు. లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో సైనిక బలగాల సన్నద్ధతను వరుసగా రెండోరోజు జనరల్‌ నరవణె పరిశీలించారు. ఫార్వర్డ్‌ పోస్ట్‌ల్లో విధుల్లో ఉన్న సైనికులతో మాట్లాడారు. ఆర్మీ చీఫ్‌కు 14 కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్, నార్తర్న్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ యోగేశ్‌ కుమార్‌ జోషి క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను వివరించారు.   

మరిన్ని వార్తలు