సరిహద్దు ఉద్రిక్తతలు: భారత్‌- చైనా చర్చలు

6 Jun, 2020 16:18 IST|Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌- చైనా మధ్య మిలటరీ స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. భారత్‌ తరఫున లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ హాజరుకాగా.. చైనా తరఫున టిబెట్‌ మిలటరీ కమాండర్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్రిక్తతలకు దారితీసిన గాల్వన్‌ లోయ, పాంగాంగ్‌ లేక్‌, గోగ్రా ప్రాంత సరిహద్దు వివాదాలే ప్రధాన ఎజెండాగా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పాంగాంగ్‌ సరస్సు, గాల్వన్‌ లోయ నుంచి చైనా బలగాలు వెనుదిరగాలని.. అదే విధంగా అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్మీ శిబిరాలను వెంటనే తొలగించాలని భారత్‌ స్పష్టం చేసింది. కాగా ఇరు దేశాల దౌత్యవేత్తలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ విషయాల గురించి శుక్రవారం చర్చించిన విషయం తెలిసిందే. ‘‘శాంతియుత చర్చల ద్వారానే ఇరు వర్గాలు విభేదాలను పరిష్కరించుకోవాలి. భేదాభిప్రాయాలను వివాదాలుగా మారకుండా చూసుకోవాలి’’అని కీలక వ్యాఖ్యలు చేశారు.(అంగుళం భూమి వదులుకోం.. క్షమించం: చైనా)

ఇప్పుడు కూడా అదే వ్యూహంతో చైనా?!
విరోధిని మానసికంగా దెబ్బకొట్టడానికి సైకలాజికల్‌ ఆపరేషన్స్‌ చేపట్టే డబ్ల్యూజెడ్‌సీ(చైనా వార్‌ జోన్‌ కాన్సెప్ట్‌) సిద్ధాంతాన్నే డ్రాగన్‌ మరోసారి అవలంబించినట్లు తాజా పరిస్థితులను బట్టి వెల్లడవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించే వీడియోలు, మ్యాపులు సోషల్‌ మీడియాలో విడుదల చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శత్రుదేశ బలగాల సన్నద్ధత, సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తేలా చేయడం.. సరిహద్దు ఉద్రిక్తతల గురించి చిలువలు పలువలుగా అధికార మీడియాలో కథనాలు ప్రచురించడం ఎత్తుగడలో భాగమేననే వాదనలు వినిపిస్తున్నాయి. 

అదే విధంగా ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్న తరుణంలో ప్రభుత్వం బాగా పనిచేస్తుందని అనిపించుకోవడం సహా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సొంత మీడియాలో ఈ మేరకు క్యాంపెయిన్‌లు నడిపిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. కరోనా విషయంలో ప్రపంచ దేశాలు తమ వైపు వేలెత్తిచూపడం.. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా తమపై తీవ్రంగా మండిపడుతూ వాణిజ్య యుద్ధానికి తెరతీయడంతో.. ప్రపంచం దృష్టిని మరల్చేందుకు డ్రాగన్‌ ఇలాంటి చర్యలకు పూనుకుందని మరికొంత మంది వాదిస్తున్నారు. ఏదేమైనా చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ డోక్లాం విషయంలో అనుసరించిన వ్యూహాలతోనే ఇప్పుడు కూడా ముందుకు సాగుతోందని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు