సాధ్యమైనంత త్వరగా శాంతి

2 Jul, 2020 04:03 IST|Sakshi

సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపు ప్రాధాన్యతాంశం

భారత్, చైనా కమాండర్‌ స్థాయి చర్చల్లో నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ:  సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవాలని భారత్, చైనా నిర్ణయించాయి. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో గత 7 వారాలుగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ‘వేగవంతమైన, క్రమానుగత, దశలవారీ’ ప్రక్రియను ప్రారంభించడం ప్రాధాన్యతాంశంగా గుర్తించే విషయంలో రెండు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇరుదేశాల కమాండర్‌ స్థాయి చర్చలు మంగళవారం దాదాపు 12 గంటల పాటు జరిగాయి. బాధ్యతాయుత విధానంలో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని రెండు దేశాల విదేశాంగ మంత్రులు జై శంకర్, వాంగ్‌ యి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే చర్చల ప్రక్రియలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

గల్వాన్‌ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయి ఘర్షణలు చోటుచేసుకున్న తరువాత జూన్‌ 17న రెండు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్‌లో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంట బలగాలను ఉపసంహరించుకోవడం క్లిష్టమైన ప్రక్రియ అని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఎల్‌ఏసీకి భారత్‌ వైపు ఉన్న చూషుల్‌లో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రెండు దేశాల మధ్య ఆర్మీ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి. భారత ప్రతినిధి బృందానికి 14 కాప్స్‌ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ నేతృత్వం వహించగా, చైనా బృందానికి టిబెట్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ మేజర్‌ జనరల్‌ లియు లిన్‌ నేతృత్వం వహించారు. ఈ రెండు బృందాల మధ్య జూన్‌ 6న తొలి విడత చర్చలు జరిగాయి.

ఆ తరువాత గల్వాన్‌ లోయలో ప్రాణాంతక ఘర్షణల అనంతరం జూన్‌ 22న మరోసారి ఈ రెండు బృందాలు సమావేశమయ్యాయి. తాజాగా భేటీ మూడోది. కాగా, ఉద్రిక్తతల సడలింపుపై రెండు దేశాలు నిజాయితీతో ఉన్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. పూర్తి స్థాయి ఒప్పందం కుదిరేందుకు ఆర్మీ, దౌత్య మార్గాల్లో మరికొన్ని విడతలు చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నాయి. సరిహద్దుల్లోని అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించాలని, ఏప్రిల్‌ ముందునాటి యథాతథ స్థితి నెలకొనేలా చూడాలని గత రెండు విడతల చర్చల్లో భారత్‌ గట్టిగా డిమాండ్‌ చేసిందని వెల్లడించాయి.

రేపు లద్దాఖ్‌లో రాజ్‌నాథ్‌ పర్యటన! 
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం లద్దాఖ్‌లో పర్యటించే అవకాశముంది. సరిహద్దు పోస్ట్‌లను సందర్శించి, భారత ఆర్మీ సన్నద్ధతను పరిశీలిస్తారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మిలటరీలోని సీనియర్‌ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని వెల్లడించాయి.   

మరిన్ని వార్తలు