‘టిక్‌టాక్‌’పై భారత్‌ నిఘానే ఎక్కువ!

4 Jan, 2020 13:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అనతికాలంలోనే ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిన సోషల్‌ మీడియా ‘టిక్‌టాక్‌’ ప్రపంచ దేశాలకన్నా భారత్‌ అధికారుల నిఘానే ఎక్కువగా కొనసాగుతోంది. వినియోగదారుల సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రపంచంలో 28 దేశాలు ‘టిక్‌టాక్‌’ యాజమాన్యాన్ని కోరగా, అందులో 36 శాతం విజ్ఞప్తులు ఒక్క భారత అధికారుల నుంచే వచ్చాయి. వాటిల్లో 107 చట్టపరమైన, అత్యవసర విజ్ఞుప్తులు ఉన్నాయని యాజమాన్యం పేర్కొంది. టిక్‌టాక్‌ యూజర్లలో 40 శాతం మంది భారతీయులే అవడం వల్ల కూడా ఎక్కువ విజ్ఞప్తులు భారత్‌ నుంచే రావచ్చని కూడా వ్యాఖ్యానించింది.

గత జనవరి 1వ తేదీ నుంచి జూన్‌ 30వ తేదీల మధ్య 28 దేశాల నుంచి తమకు యూజర్ల సమాచారం కావాలంటూ విజ్ఞప్తులు వచ్చాయని ఇటీవల విడుదల చేసిన ఓ అధికార నివేదికలో ‘టిక్‌టాక్‌’ యాజమాన్యం వెల్లడించింది. ఇలా వివిధ దేశాల ప్రభుత్వాల నుంచి వచ్చే విజ్ఞప్తులను తాము తీవ్రంగానే పరిగణిస్తామని, యూజర్‌ కామెంట్లు వివిధ దేశాల స్థానిక చట్టాలను ఉల్లంఘించే విధంగా ఉన్నాయా?, దేశాల విజ్ఞప్తులు న్యాయ ప్రక్రియకు లోబడే ఉన్నాయా ? అన్న అంశాలను ఒకటికి, రెండు సార్లు పరిశీలిస్తామని యాజమాన్యం తెలిపింది.

భారత్‌ నుంచి వచ్చిన విజ్ఞప్తుల్లో సగానికన్నా తక్కువ కేసుల్లోనే వినియోగదారుల సమాచారాన్ని అందించినట్లు చైనాకు చెందిన స్వల్ప కాలిక వీడియోలను అప్‌లోడ్‌ చేసే ‘టిక్‌టాక్‌’ యాజ్‌మాన్యం తెలిపింది. టిక్‌టాక్‌ కూడా పెడదోరణలనుబట్టే సమాచారాన్ని ప్రోత్సహిస్తోందని, పిల్లల ప్రైవసీకి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఫలానా సమాచారం స్థానిక చట్టాలకు విరుద్ధంగా ఉందంటూ, దాన్ని వెంటనే తొలగించాలంటూ కూడా ప్రభుత్వ అధికార విభాగాల నుంచి తమకు విజ్ఞప్తులు వస్తుంటాయని, గతేడాది అలాగా 11 విజ్ఞప్తులు రాగా, వాటిలో ఎనిమిది అకౌంట్లను పూర్తిగా మూసివేశామని, మిగతా మూడింటిలో ‘విషయాన్ని’ తొలగించామని యాజమాన్యం తెలిపింది.
 

మరిన్ని వార్తలు