9,304 కేసులు.. 260 మరణాలు

5 Jun, 2020 05:01 IST|Sakshi

దేశంలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా ఉధృతి 

ఇప్పటిదాకా మొత్తం కేసులు 2,16,919.. మరణాలు 6,075  

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి మృత్యుక్రీడ కొనసాగుతూనే ఉంది. కరోనా బాధితుల మరణాల సంఖ్య 6 వేలు దాటిపోయింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు.. కేవలం 24 గంటల వ్యవధిలో కొత్తగా 9,304 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంటే గంటకు 387 మంది ఈ వైరస్‌ బారినపడినట్లు స్పష్టమవుతోంది. తాజాగా 260 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటిదాకా ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే మొదటిసారి.

ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 2,16,919కు, మరణాలు 6,075కి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం క్రియాశీల కరోనా కేసుల సంఖ్య 1,06,737 కాగా, 1,04,107 మంది కరోనా బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో 3,840 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 47.99 శాతానికి తగ్గడం కొంత ఆందోళన కలిగిస్తోంది. కరోనా ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే, స్పెయిన్, ఇటలీ తర్వాత స్థానం ఇండియాదే కావడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు