కరోనా అంతానికిది ఆరంభం

6 Jul, 2020 03:55 IST|Sakshi

కొవాక్సిన్, జైకొవ్‌–డీ టీకాల హ్యూమన్‌ ట్రయల్స్‌కు అనుమతి లభించడంపై కేంద్రం ప్రకటన

న్యూఢిల్లీ: భారత్‌లో తయారవనున్న రెండు కరోనా టీకాలు ‘కొవాక్సిన్‌’, ‘జైకొవ్‌– డీ’లకు హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతించడంతో కరోనా అంతం ప్రారంభమైనట్లయిందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా కరోనా టీకాలు ప్రయోగదశలో ఉన్నాయని, అందులో 11 మాత్రమే హ్యూమన్‌ ట్రయల్స్‌ దశకు చేరుకున్నాయని పేర్కొంది. భారత్‌లో కరోనా టీకాను రూపొందించేందుకు ఆరు సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపింది.

వాటిలో కొవాక్సిన్, జైకొవ్‌–డీలకు మాత్రం హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ) అనుమతించిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ వెల్లడించింది. ప్రముఖ ఆస్ట్రాజెనెకా(బ్రిటన్‌), మోడెర్నా(అమెరికా) ఫార్మా కంపెనీలతోనూ భారత కంపెనీలు ఉత్పత్తి ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, అయితే, అవి రూపొందించిన టీకాలు సురక్షితం, సమర్ధవంతమని రుజువు కావాల్సి ఉందని వివరించింది. కరోనా వైరస్‌కు టీకా ఆగస్ట్‌ 15 నాటికి సిద్ధమవుతుందని ఐసీఎంఆర్‌ చేసిన ప్రకటనపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం విశేషం.

రానున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేశారని విపక్షాలు ఆరోపించాయి. ఆగస్ట్‌ 15 నాటికి వ్యాక్సిన్‌ను సిద్ధం చేయడం సాధ్యం కాదని నిపుణులు వాదిస్తున్నారు. ఐసీఎంఆర్‌ సహకారంతో హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ ‘కొవాక్సిన్‌’ను రూపొందించే పనిలో ఉంది. అలాగే, ‘జైకొవ్‌–డీ’ని రూపొందించేందుకు జైడస్‌ క్యాడిలా కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండింటికి ఫేజ్‌ 1, ఫేజ్‌ 2 ప్రయోగాలకు అనుమతి లభించింది. కొవాక్సిన్‌ ఫేజ్‌ 1 ట్రయల్స్‌ ముగిసేందుకే కనీసం 28 రోజులు పడుతుంది. ఆ తరువాత ఫేజ్‌ 2, ఫేజ్‌ 3 ట్రయల్స్‌ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్ట్‌ 15 నాటికి వ్యాక్సిన్‌ ఎలా సిద్ధమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు