ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ ‘బెటర్‌’

20 Sep, 2018 17:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ చమురు ధరల కారణంగా దేశీయంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి పతనం కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ మెరుగ్గానే ఉందని 56 శాతం మంది ప్రజలు ఓ సర్వేలో అభిప్రాయపడ్డారు. వాస్తవానికి భారత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని 2017లో 83 శాతం మంది అభిప్రాయపడగా 2018, జూన్‌ నాటికి వారి సంఖ్య 56 శాతానికి పడిపోయింది. మే 23వ తేదీ నుంచి జూలై 23వ తేదీల మధ్య అమెరికా మేథావుల సంఘం ‘ప్యూ రీసర్చ్‌ సెంటర్‌’ ఈ సర్వేను నిర్వహించింది.

ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో ఆయా దేశాల ఆర్థిక పరిస్థితిపై సర్వే నిర్వహించిన ప్యూ రీసర్చ్‌ సెంటర్‌ భారత్‌లో వివిధ వర్గాలకు చెందిన 2,521 మంది అభిప్రాయాలను సేకరించడం ద్వారా సర్వే ఫలితాలను క్రోడీకరించింది. భారత్‌లో పాలకపక్షానికి మద్దతిస్తున్న వారిలో 72 శాతం మంది దేశ ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పడం గమనార్హం. భారత్‌ జాతీయ స్థూల ఉత్పత్తి 1990 దశకం నుంచి ఇప్పటి వరకు 266 శాతం పెరగడంతోనే భారత ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని చెబుతున్నారు. ఇక సర్వే చేసిన వారిలో 66 శాతం మంది తమకన్నా తమ పిల్లల ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నారు.

డాలర్‌తో పోటీ పడలేక రూపాయి విలువ ఈ ఒక్క ఏడాదిలో 11 శాతం తగ్గిన విషయం తెల్సిందే. అమెరికా, బ్రిటన్, జపాన్‌ ఆర్థిక వ్యవస్థలతో పోల్చికున్నప్పటికీ గత 20 ఏళ్ల క్రితం కంటే నేడు భారత ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని 62 శాతం మంది అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం హయాంలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయన్న అంశంపై ఓ పక్క వేడిగా వాడిగా చర్చ జరుగుతున్నప్పటికీ 2027 నాటికి ఉద్యోగాలు దొరకడం కష్టం కావచ్చని మెజారిటీ శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు