హింసపై ఉక్కుపాదం

29 Apr, 2017 03:21 IST|Sakshi
హింసపై ఉక్కుపాదం

భారత్‌–సైప్రస్‌ నిర్ణయం
- నాలుగు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ.. హింసను ప్రోత్సహించే దేశాలపై కఠినంగా వ్యవహరించాలని భారత్‌–సైప్రస్‌ దేశాలు నిర్ణయించాయి. శుక్రవారం ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ అనస్తాసియేడ్స్‌ మధ్య ద్వైపాక్షిక అంశాలు, ప్రాంతీయ సమస్యలపై చర్చ జరిగింది. వైమానిక సేవలు, వాణిజ్య, నౌకాయాన సహకారం సహా  4 అంశాలపై వీరి సమక్షంలో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. టర్కీతో సైప్రస్‌కున్న సరిహద్దు వివాదాల పరిష్కారానికి భారత్‌ చొరవచూపాలని నికోస్‌ కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. సైప్రస్‌ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు భారత్‌ వెన్నంటి నిలిచిందన్నారు. 

‘ఈ ప్రాంతంలో ఉగ్రవాదులను తయారూచేస్తూ వారికి ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై అన్ని దేశాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరంపై మా (భారత్‌–సైప్రస్‌) మధ్య అంగీకారం కుదిరింది. భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి సైప్రస్‌ మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. భద్రతా మండలిలో సంస్కరణలపైనా చర్చ జరిగింది’ అని మోదీ తెలిపారు. అనంతరం నికోస్‌తో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహకారంపై వీరిద్దరూ చర్చించారు. రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించిన నికోస్‌ ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతోనూ సమావేశమయ్యారు.

మరిన్ని వార్తలు