కోవిడ్‌.. జాతీయ విపత్తు

15 Mar, 2020 03:47 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ను భారత్‌ జాతీయ విపత్తుగా ప్రకటించింది. వ్యాధి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు హోంశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం రాసిన ఒక లేఖలో పేర్కొంది. కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ప్రపంచబ్యాంకు ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించిన కారణంగా కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని నిర్ణయించినట్లు తెలిపింది. స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌ కింద రాష్ట్రాలకు సాయం అందించేందుకు నిర్ణయించింది.

కోవిడ్‌ చికిత్సకు ఆసుపత్రుల్లో చేరేవారి కోసం ఈ నిధులు రాష్ట్రాలకు అందిస్తామని, ఇందుకు తగిన రేట్లను ఆయా రాష్ట్రాలే నిర్ణయిస్తాయని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌ బాధితులకు తాత్కాలిక వసతి ఇచ్చేందుకు, ఆహారం, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులను వాడుకోవచ్చు. క్వారంటైన్‌ క్యాంపుల సంఖ్య, ఎంత కాలం కొనసాగాలి? ఎంత మందిని ఈ క్యాంపుల్లో ఉంచాలన్నది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకుంటాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను ధర్మల్‌ స్కానర్లు, వెంటిలేషన్‌ తదితర పరికరాల కొనుగోలుకూ వాడవచ్చునని హోం శాఖ తెలిపింది.

మార్గదర్శకాలను ట్వీట్‌ చేసిన ప్రధాని
కోవిడ్‌ వైరస్‌ను నిరోధించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘వ్యాధి లక్షణాలు ఉన్న వారు ఇళ్లలోనే గడిపే సందర్భంలో తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలు మిమ్మల్నీ, మీ వాళ్లను రక్షించుకునేందుకు ఉపయోగపడతాయి’ అని ట్వీట్‌ చేశారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు అటాచ్డ్‌ బాత్రూమ్‌ ఉండే, గాలి, వెలుతురు బాగా వచ్చే గదిలో ఉండాలని సూచించారు. ఎక్కువ మంది అదే గదిలో ఉండాల్సి వస్తే 3అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉండాలని చెప్పారు. వీలైనంత వరకు వృద్ధులు, గర్భిణులు, పిల్లలకు దూరంగా ఉండాలన్న ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను ట్వీట్‌లో పేర్కొన్నారు.

పద్మ ప్రదానోత్సవాలు వాయిదా
మార్చి 26, ఏప్రిల్‌ 3వ తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరగాల్సిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలను కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం వాయిదావేసింది. వేర్వేరు రంగాల్లో విశేష కృషిచేసిన 141 మందికి కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించడం తెల్సిందే. ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులను గతంలో ప్రకటించారు.

అంత్యక్రియలపై మార్గదర్శకాలు
ఢిల్లీలో వైరస్‌ కారణంగా మృతి చెందిన 68 ఏళ్ల మహిళ అంత్యక్రియలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో కరోనా మృతుల అంతిమ సంస్కారాలపై మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. మృతుల శరీరాల నుంచి ఇతరులకు వ్యాధి సోకే అవకాశం లేకపోయినప్పటికీ ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అపోహలను తొలగించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదంచేస్తాయి. శ్వాస సంబంధిత వ్యాధి అయిన కోవిడ్‌ దగ్గు, తుమ్ముల వల్ల బయటకు వచ్చే ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని, మార్చురీ నుంచి లేదా మృతదేహం నుంచి వ్యాపించే అవకాశం లేదని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎబోలా, నీపా వంటి వైరస్‌లు మృతుల శరీరాల నుంచి వెలువడే ద్రవాలను తాకడం ద్వారా రావచ్చుకానీ కరోనా అలా కాదని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం శరీరాన్ని తగు విధంగా చుట్టి దహనం/ఖననం చేయవచ్చునని పేర్కొనడం గమనార్హం.

మరిన్ని వార్తలు