లద్దాఖ్‌కు క్షిపణి వ్యవస్థ

28 Jun, 2020 04:47 IST|Sakshi
లేహ్‌లో గస్తీ తిరుగుతున్న భారత చినూక్‌ హెలికాప్టర్‌

సరిహద్దు వెంట మోహరింపులు పెంచిన భారత్‌

చైనా దుస్సాహసానికి చెక్‌ పెట్టేందుకే..

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ముందుకు చొచ్చుకువచ్చిన చైనా ఆర్మీ వెనక్కి తగ్గేది లేదంటూ మొండికేసింది. పైపెచ్చు వివాదాస్పద ప్రాంతాల్లోకి భారీగా సైనిక బలగాలను దించుతోంది. దీంతో భారత్‌ అదే స్థాయిలో చర్యలు చేపడుతోంది. లద్దాఖ్‌కు ఆర్మీతోపాటు వైమానిక బలగాలను తరలించింది. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు కీలకమైన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలను తరలించింది.

గల్వాన్‌ ఘటన జరిగిన పెట్రోల్‌ పాయింట్‌–14 వద్దకు రెండు దేశాలు బలగాలను, సైనిక సంపత్తిని భారీగా తరలించాయి. ఈ ఘటన జరిగిన అనంతరం అదే రోజు రెండు దేశాల కార్ప్స్‌ కమాండర్ల స్థాయిలో చర్చలు ఒక వైపు సాగుతుండగానే చైనా అబ్జర్వేషన్‌ పోస్టులు, టెంట్లతోపాటు గోడను నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో తేలింది. అక్కడి నుంచి వెనక్కి తగ్గేందుకు చైనా నిరాకరించడంతో ఆ రోజు జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. గతంలో ఎన్నడూ కూడా గల్వాన్‌ లోయను తమ మ్యాప్‌లో చైనా చూపించుకోలేదు.

అయినప్పటికీ, అది తమ భూభాగం కాబట్టే అక్కడికి వచ్చామనీ, తిరిగి ఎందుకు వెనక్కి వెళ్లాలని చైనా ప్రతినిధులు వాదించినట్లు సమాచారం.  ఆ తర్వాత జరగాల్సిన చర్చల తేదీలు కూడా ఖరారు కాకపోవడం గమనార్హం. ఇదే సమయంలో రెండు దేశాలు ఎల్‌ఏసీ వెంట ఆయుధ సంపత్తిని, బలగాలను మోహరించడం కొనసాగిస్తున్నాయి. మరో మూడు నెలల తర్వాత లద్దాఖ్‌లో మళ్లీ మంచు కురియడం మొదలవుతుంది. ఆ సమయంలో లద్దాఖ్‌కు మిగతా భారత దేశంతో దాదాపు 6 నెలలపాటు సంబంధాలు తెగిపోతాయి. భారత సైన్యం కూడా అటువంటి పరిస్థితులకు తగ్గట్లుగా ఏర్పాట్లకు సిద్ధమైంది.

చైనా మోహరింపులిలా..
► ఎల్‌ఏసీ వెంట చైనా భారీగా బలగాలు, ట్యాంకులు, క్షిపణులు, యుద్ధ విమానాలను మోహరించింది. పాంగాంగ్‌ త్సోలోని ఫింగర్‌4 వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటుచేసింది.

► సుఖోయ్‌–30 వంటి యుద్ధ విమానాలు, వ్యూహాత్మక బాంబర్లను అక్కడ మోహరించింది. ఇవి భారత్‌తో సరిహద్దులకు 10 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి పహారా కాస్తున్నట్లు సమాచారం.

► దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, పెట్రోలింగ్‌ పాయింట్‌–14 సమీపంలోని గల్వాన్‌ లోయ, పెట్రోలింగ్‌ పాయింట్‌–15,17, 17ఏ, ఫింగర్‌ పాయింట్, పాంగోంగ్‌ త్సోలకు సమీపంలోని చైనా సైనిక హెలికాప్టర్లు గస్తీ చేపట్టాయి.

భారత్‌ ఏం చేస్తోందంటే..
► ఉత్తర భారతదేశంలోని ఎయిర్‌ బేస్‌లు, కంటోన్మెంట్‌లలో ఉన్న బలగాలు, ఫిరంగులు, శతఘ్ని దళాలు, నిఘా రాడార్లు, ఫైటర్‌ జెట్లు, హెలికాప్టర్లు గత నెల నుంచి లద్దాఖ్‌కు తరలుతున్నాయి. నూతనంగా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ప్రస్తుతం 45వేల సైన్యం మోహరించి ఉంది.  

► చైనా బలగాలు ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తక్షణమే తప్పికొట్టేందుకు వైమానిక, నావికా దళాలకు చెందిన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను తూర్పు లద్దాఖ్‌కు తరలించింది. వేగంగా ప్రయాణించే యుద్ధ విమానాలతోపాటు డ్రోన్లను సైతం రెప్పపాటులోనే నేలకూల్చే సామర్ధ్యం ఉన్న ఆకాశ్‌ క్షిపణులు ఇందులో ఉన్నాయి.

► చండీగఢ్‌లోని వైమానిక స్థావరం నుంచి 46 టన్నుల భారీ టి90 యుద్ధట్యాంక్‌ను సి17 గ్లోబ్‌మాస్టర్‌ విమానం లద్దాఖ్‌కు మోసుకెళ్లింది.
 
► దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, ఫుక్చే, నియోమాల్లోని అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్స్‌ను ఎయిర్‌ ఫోర్స్‌ అప్రమత్తం చేసింది. ఈ ప్రాంతంలో ఎస్‌యు30 ఎంకేఐ యుద్ధ విమానాలను మోహరించింది. శ్రీనగర్, లేహ్‌లో జాగ్వార్, మిరాజ్‌–200 యుద్ధ విమానాలు, అపాచీ హెలికాప్టర్లను రంగంలోకి దించింది.

► సముద్రంలో చైనా కదలికలపై కన్ను వేసి ఉంచేందుకు నేవీ తన పి–81 నిఘా విమానాన్ని గస్తీకి పంపింది.

► లద్దాఖ్‌లోని 1,597 కిలోమీటర్ల పొడవైన చైనా సరిహద్దుల్లో ఉన్న 65 పాయింట్లలో పహారాను మరింత పెంచింది.

► సరిహద్దుల్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గల్వాన్‌ లోయ, లద్దాఖ్‌లోని హాట్‌ స్ప్రింగ్స్, డెప్సంగ్‌ మైదానాలు, ప్యాంగాంగ్‌ త్సోతోపాటు ఉత్తర సిక్కింలోని నకు లా ప్రాంతాల్లో భారత్, చైనా బలగాలు అత్యంత సమీపంలో మోహరించి ఉండటంతో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.

నిపుణులు ఏమన్నారంటే..
► ‘అతిక్రమణలను, భారత భూభాగం వైపు నిర్మాణాలు చేపట్టడం చైనా నిలిపివేయాలి. సైనిక ప్రతిష్టంభన తొలగిపోవడానికి ఏకైక పరిష్కారం ఇదే’ అని చైనాలో భారత రాయబారి విక్రమ్‌ మిస్రీ అన్నారు.

► వెనక్కి తగ్గేందుకు రెండు పక్షాలు ఏమేరకు సానుకూలంగా ఉన్నాయనే దానిపైనే వివాద పరిష్కారం ఆధారపడి ఉంది’ అని మాజీ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హూడా అన్నారు.  

► ‘సరిహద్దుల్లో మోహరింపులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలున్నాయి. బలగాల ఉపసంహరణ టి–20 మ్యాచ్‌లాగా వెంటనే ఫలితం తేలేది కాదు, టెస్ట్‌ మ్యాచ్‌ వంటిది. ఇందుకు 2, 3 నెలల వరకు పట్టవచ్చు. అంతకంటే, ఎక్కువ కాలం కూడా కొనసాగవచ్చు’ అని సైనిక ప్రధాన కార్యాలయంలోని ఓ అధికారి అంచనా వేశారు.

► భారత్‌తో సరిహద్దుల వెంట చైనా అనుసరిస్తున్న వైఖరితో ఆ దేశం భవిష్యత్తులో సుదీర్ఘ కాలం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని డిప్యూటీ చీఫ్‌ ఆర్మీ స్టాఫ్‌(రిటైర్డు) లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్మీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇలాంటి తీరుతో ఆ దేశం అంతర్జాతీయంగా ఏకాకిగా మారుతుందన్నారు. ప్రపంచమంతా కోవిడ్‌–19 మహమ్మారితో పోరాడుతుంటే చైనా మాత్రం లద్దాఖ్‌లో దుశ్చర్యకు పాల్పడటం ఆ దేశం నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిందని అమెరికాతో టారిఫ్‌ యుద్ధం, ఆస్ట్రేలియాతో విభేదాలు, హాంకాంగ్‌లో దిగజారుతున్న పరిస్థితులతో చైనాకు గడ్డు పరిస్థితులు తప్పవన్నారు. గల్వాన్‌ ఘటనతో చైనా సైన్యం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఒక రాజకీయ బలగమే తప్ప దానికి ఎలాంటి సైనిక ప్రమాణాలు లేనట్లు అర్థమవుతోందని చెప్పారు.

మరిన్ని వార్తలు