-

ఆ ఒక్క దేశం మినహా..

5 Oct, 2019 04:19 IST|Sakshi

ఇరుగుపొరుగు దేశాలన్నీ చక్కగా సహకరించుకుంటున్నాయి 

విదేశాంగ మంత్రి జైశంకర్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: భారత్‌ పొరుగు దేశాల్లో ఒక్కటి(పాకిస్తాన్‌) మినహా అన్ని దేశాలు ప్రాంతీయ సహకారం విషయంలో కలిసికట్టుగా పని చేస్తున్నాయని, పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నాయని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చెప్పారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో భారత ఆర్థిక సదస్సు సందర్భంగా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షుడు బొర్జి బ్రెండేతో మాట్లాడారు.  ప్రాంతీయ సహకారం విషయంలో ఆ ఒక్క దేశం కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో జాతీయవాదాన్ని ప్రతికూల అంశంగా చూడొద్దని చెప్పారు.  

ఇమ్రాన్‌ వ్యాఖ్యలు దారుణం
ఆర్టికల్‌ 370 అంశంపై పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ తరచూ బాధ్యతారాహిత్యమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ విమర్శించారు. ఇమ్రాన్‌ వ్యాఖ్యలను  తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇమ్రాన్‌  తన హోదాకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. భారత్‌కు వ్యతిరేకంగా జిహాద్‌ కు ఇమ్రాన్‌ బహిరంగంగా పిలుపునివ్వడం దారుణమని అన్నారు. అంతర్జాతీయ సంబంధాల గురించి ఆయనకు తెలియదని తప్పుపట్టారు.

మరిన్ని వార్తలు