ఐరాస ఎన్నిక‌ల్లో భార‌త్ విజ‌యం

18 Jun, 2020 08:32 IST|Sakshi

ఐరాసలో భారత్‌కు తాత్కాలిక సభ్యదేశ హోదా 

184 ఓట్లను గెలుచుకున్న భారత్‌

2021 జనవరి 1 నుండి రెండేళ్లపాటు

సాక్షి, న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి తాత్కాలిక స‌భ్య‌త్వపు ఎన్నికల్లో భారత్‌ విజయం సాధించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో భారత్‌కు మరోసారి తాత్కాలిక సభ్యదేశ హోదా లభించింది. దీంతో రెండేళ్లపాటు (2021–22) భారత్ కొనసాగనుంది.‌ ఐరాసలో సభ్యదేశంగా భారత్ ఎంపిక కావడం ఇది ఎనిమిదోసారి. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్‌ గ్రూప్‌ నుంచి కేవలం భారత్‌ ఒక్కటే పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా భద్రతా మండలి ఎన్నికల్లో విజయం సాధించగా, కెనడా ఓటమిపాలైంది

ఐరాసలో అత్యంత శక్తిమంతమైన విభాగం భద్రతా మండలి. అంతర్జాతీయంగా శాంతి భద్రతల పరిరక్షణను ఇదే పర్యవేక్షిస్తుంది. ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధించే అధికారం ఉంది. సమితిలో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉండగా, మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్), పది తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి. శాశ్వత సభ్యదేశాలకు ‘వీటో’ అధికారం ఉంటుంది. తాత్కాలిక సభ్యదేశాలను రెండేళ్ల సభ్యత్వ కాలానికి రొటేషన్ పద్ధతిలో సర్వసభ్య సభ ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తుంది. మండలిలో కీలక నిర్ణయాలకు కనీసం 9 సభ్యదేశాల ఆమోదం అవసరం. అయితే ఏదైనా నిర్ణయానికి అవసరమైనన్ని సభ్యదేశాల ఆమోదం ఉన్నప్పటికీ.. శాశ్వత సభ్యదేశాల్లో ఏదైనా దేశం వ్యతిరేకించి వీటో చేస్తే ఆ నిర్ణయం ఆమోదం పొందదు. కాగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా, చైనా అందుకు మోకాలడ్డుతోంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా