అడుగంటుతున్న నీటి యాజమాన్యం..!

15 Jun, 2018 22:01 IST|Sakshi

దేశ చరిత్రలోనే అతి క్లిష్టమైన నీటి సంక్షోభాన్ని ప్రస్తుతం భారత్‌ ఎదుర్కుంటోంది.  సగం జనాభా అంటే...60 కోట్ల మందికి పైగా నీరు అందుబాటులో లేక తీవ్ర సమస్యల పాలవుతున్నారు. సురక్షితమైన నీటిని పొందలేని పరిస్థితుల్లో ఏడాదికి దాదాపు రెండులక్షల మంది తనువులు చాలిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చనున్న నేపథ్యంలో జీవనోపాధి అవకాశాలు గణనీయంగా దెబ్బతింటాయి...రాబోయే రోజుల్లో నీటి సంక్షోభం మరింత పెరుగుతుంది. వచ్చే పదేళ్లలోనే ఈ సమస్య తీవ్రాతి తీవ్రమవుతుందని ‘సమ్మిళిత నీటి నిర్వహణ సూచి’ (కాంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌) పేరిట నీతి ఆయోగ్‌  తాజా నివేదిక విడుదల చేసింది. ఇందులో దేశం ఎదుర్కుంటున్న నీటి సంక్షోభం గురించి హెచ్చరిస్తూ...  దేశ ఆహార భద్రత సమస్యకు కూడా ఇది దారితీయొచ్చని తెలిపింది.  2016-17లో దేశంలోని రాష్ట్రాలు నీటి నిర్వహణకు తీసుకున్న చర్యల ఆధారంగా దీనిని తయారు చేసింది.  


తగ్గనున్న హైదరాబాద్‌ భూగర్భజలాలు..
మరీ ముఖ్యంగా మరో ఏడాదిన్నర సమయంలోగానే... అంటే 2020 కల్లా  న్యూఢిల్లీ , బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లతో సహా దేశంలోని 21 నగరాల్లోని భూగర్భజలాలు పూర్తిస్థాయిలో అడుగంటì పోతాయి. దీని ప్రభావం పదికోట్ల మందిపై తీవ్రంగా పడుతుంది. మొత్తం 122 దేశాల్లోని ‘నీటి నాణ్యతా సూచి’లో భారత్‌ 120 స్థానంలో నిలుస్తోంది. దేశంలోని దాదాపు 70 శాతం వరకు నీరు కలుషితమైందని వివిధ స్వతంత్రసంస్థల గణాంకాలను ఈ అధ్యయనంలో ఉటంకించారు. దల్‌బర్గ్‌ అనాలిసిస్, ఎఫ్‌ఏఓ, యూనిసెఫ్‌ వంటి సంస్థలు అందించిన వివరాలను బట్టి 2030 కల్లా 40 శాతం జనాభాకు మంచినీరు అందుబాటులో ఉండదు.దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణ, యాజమాన్యం విషయంలో  మొట్టమొదటిసారిగా  ఓ సూచి ఆధారంగా వివిధ  నగరాలకు ర్యాంకింగ్‌లిచ్చింది.  భూగర్భజలాలు, నీటి వనరుల పునరుద్ధరణ, నీటిపారుదలరంగం, వ్యవసాయ పద్థతులు, తాగునీరు, విధానాలు, పాలన పద్ధతులు వంటి  విస్తృత రంగాలు, అంశాల పరిధిలోని  వివిధ ఇండికేటర్ల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. 

అగ్రస్థానం గుజరాత్‌... అథమం జార్ఖండ్‌...
 నీటి నిర్వహణసూచి ర్యాంకింగ్‌లలో గుజరాత్‌ ప్రధమస్థానం సొంతం చేసుకుంది.ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నిలిచాయి. మధ్యస్థ పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో తెలంగాణ నిలుస్తోంది.   జార్ఖండ్, బిహార్, హర్యానా చివరిస్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాల పనితీరు బాగా లేదు. ఈ రాష్ట్రాలకు ‘నాన్‌ హిమాలయన్‌ స్టేట్స్‌’ కే టగిరిలో ర్యాంకులిచ్చారు.  ‘ఈశాన్య, హిమాలయన్‌’ కేటగిరిలో తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కుంటున్న హిమాచల్‌ప్రదేశ్‌ 8 సభ్యరాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. 
ఒక్కో రాష్ట్రం భిన్నమైన నీటి సూచి స్కోర్లు సాధించాయి. అత్యధిక రాష్ట్రాలు 50 శాతం కంటే తక్కువ మార్కులు పొందాయి. నీటి నిర్వహణ,యాజమాన్య పద్ధతులను చాలా మటుకు రాష్ట్రాలు మరింత మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యత ఉందని ఈ పరిశీలనలో వెల్లడైంది. 

సవాళ్లేమిటీ ?

  • 2030 కల్లా దేశంలో అందుబాటులో ఉన్న నీటి  కంటే డిమాండ్‌ రెండింతలు పెరగనుంది
  • కోట్లాది మంది తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటారు
  • దేశంలోని 52 శాతం వ్యవసాయ ప్రాంతం వర్షాధారం కావడంతో చిట్టచివరి భూములకు నీళ్లు అందేలా నీటిపారుదల భవిష్యత్‌ విస్తరణ చేపట్టాల్సి ఉంటుంది
  • నీటి సమస్య కారణంగా 2050 కల్లా స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 6 శాతం మేర నష్టపోయే అవకాశాలున్నాయి.

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు