పావురం ఛాతి ఉంటే అన్‌ఫిట్‌...

23 Jun, 2017 14:20 IST|Sakshi
పావురం ఛాతి ఉంటే అన్‌ఫిట్‌...

న్యూఢిల్లీ: భారత దేశంలో 1914 నాటి మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో మోటార్‌ వాహనాల ఇన్‌స్పెక్టర్‌ పదవికి అర్హులు కావాలంటే తళతళలాడే తెల్లటి పలు వరుస ఉండాలి. అందుకు క్రమం తప్పకుండా బ్రెష్‌ చేసుకునే అలవాటు ఉండాలి. ముందుకు ఎముక పొడుచుకు వచ్చినట్లుగా పావురం ఛాతి లాంటి ఛాతి ఉండకూడదు. మోకాళ్లు తగిలేలా తాకుడు కాళ్లు ఉండరాదు. బల్లబరుపు పాదాలు ఉండకూడదు. పాదం బొటనవేలు కిందక వంగి ఉండరాదు.

1878 నాటి భారత ఖజానా చట్టం ప్రకారం పది రూపాయలకంటే ఖరీదైనా ఏ వస్తువు ఏ వ్యక్తి కలిగి ఉన్నా దానికి రెవెన్యూ అధికారి అనుమతి తప్పనిసరి. అలా లేకపోతే ఏడాది జైలు శిక్ష తప్పదు. 1934 ఎయిర్‌క్రాఫ్ట్‌ చట్టం ప్రకారం విమానాలతోపాటు గాల్లో పతంగులు ఎగరేసేందుకు కూడా అనుమతులు తప్పనిసరి. కొన్ని రాష్ట్రాల్లో ప్రజల ఇళ్లపైకి, పొలాలపైకి ఎలాంటి కరపత్రాలు పడకుండా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల పోలీసుల బాధ్యత.

రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ప్రచారోద్యమాన్ని అడ్డుకునేందుకు వచ్చిన నిబంధన. దేశ విభజన సందర్భంగా పాకిస్తాన్‌ వలసపోయిన ప్రజలకు ఎప్పుడైనా బెంగాల్, అస్సాం, పంజాబ్‌ కోర్టులను ఉపయోగించుకునే హక్కు ఉంది. గంగా నదిలో ఒక ఒడ్డు నుంచి రెండో ఒడ్డుకు ప్రయాణికులను తీసుకెళ్లే పడవలు రెండు అణాలకు మించి టోల్‌ టాక్స్‌ వసూలు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు అణాలే లేవు.

21 ఏళ్లలోపు యువకులు చదవకూడని లేదా హానికరమైన విషయాన్ని ప్రచురించరాదని 1956 నాటి యువకుల హానికర ప్రచురుణ చట్టం తెలియజేస్తోంది. అప్రదిష్టకరమైన ప్రదర్శనలను నిషేధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకుందని 1876 నాటి డ్రామటిక్‌ పర్‌ఫార్మెన్స్‌ చట్టం తెలియజేస్తోంది. భారత కోర్టులిచ్చే ఏ తీర్పునైనా సమీక్షించే అధికారం బ్రిటిష్‌ రాణికి ఉంది.

ఎప్పుడో కాలంతీరి పోయిన ఇలాంటి చట్టాల్లో 1200 చట్టాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో రద్దు చేసింది. మరో 1824 చట్టాలను రద్దు చేయాల్సి ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే కాలంతీరి పోయిన చట్టాలను గుర్తించి వాటిని రద్దు చేయడానికి తన కార్యాలయంలోని కార్యదర్శి ఆర్‌. రామానుజం అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

ఇదే లక్ష్యంతో 1998లో అప్పటి ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజపేయి కూడా ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ కాలం తీరిపోయిన చట్టాలను గుర్తించింది. అయితే వాటిని రద్దు చేసే ప్రక్రియ కొనసాగలేదు. ఇప్పటి రామానుజం కమిటీ కూడా అప్పటి కమిటీ సమీక్షలను పునర్‌ సమీక్షించి సముచిత నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాలంతీరి పోయిన 1200 చట్టాలను రద్దు చేయగా, ఇప్పటి ప్రభుత్వం మూడేళ్ల కాలంలోనే ఏకంగా 1300 చట్టాలను రద్దు చేసింది. దీనికి రాజ్యసభబో మెజారిటీ కలిగిన యూపీఏ కూటమి కూడా సహకరించింది.

మరిన్ని వార్తలు