భారత్‌లో తొలి మరణం

13 Mar, 2020 04:39 IST|Sakshi
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌ గురువారం దాదాపు నిర్మానుష్యంగా మారిన దృశ్యం

బుధవారం కర్నాటకలో మరణించిన వ్యక్తికి కోవిడ్‌–19 నిర్ధారణ

అంతకముందు హైదరాబాద్‌లో చికిత్స పొందిన బాధితుడు మహ్మద్‌ హుస్సేన్‌ సిద్ధఖీ

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో పాజిటివ్‌ కేసు నమోదు

సాక్షి సిటీబ్యూరో/బెంగళూరు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లో తొలి మరణాన్ని తన ఖాతాలో వేసుకుంది. కర్నాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ సిద్ధఖీ(76) కోవిడ్‌ లక్షణాలతో బాధ పడుతూ బుధవారం మరణించారు. ఆయనకు కరోనా సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని గురువారం కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి బీ శ్రీరాములు నిర్ధారించారు. జనవరి చివరి వారంలో సౌదీ అరేబియాకు వెళ్లిన సిద్ధఖీ ఫిబ్రవరి 29న తిరిగి వచ్చారు.

దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆయనను 4వ తేదీన గుల్బర్గాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయినా జ్వరం తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను అంబులెన్స్‌లో సోమవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. తొలుత జూబ్లిహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి, ఆ తర్వాత బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న మరో కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అడ్మిట్‌ చేసుకోకపోవడంతో చివరకు బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ ఒకటిలో ఉన్న మరో కార్పొరేట్‌ ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. (కరోనాతో వ్యక్తి మృతి : భారత్లో తొలి కేసు..!)

వైద్యులు అప్పటికే బాధితుడికి కరోనా సోకినట్లు అనుమానించారు. గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. బంధువులు ఆయన్ను గాంధీకి తీసుకెళ్లకుండా ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో మంగళవారం మళ్లీ గుల్బార్గకు తీసుకెళ్లారు. మంగళవారం గుల్చార్గా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ వైద్యులు బాధితుని నుంచి నమూనాలు సేకరించి, బెంగళూర్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపింది. బాధితుడు బుధవారం సాయంత్రం మృతి చెందాడు. బాధితుడికి సంబంధించిన రిపోర్ట్‌లు గురువారం సాయంత్రం వచ్చాయి. ఆ మెడికల్‌ రిపోర్ట్‌ల్లో అతడికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.  

హైదరాబాద్‌ అలర్ట్‌
కోవిడ్‌–19తో మృతి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందిన నేపథ్యంలో హైదరాబాద్‌ సహా తెలంగాణాలో ఆందోళన నెలకొంది. ఆయనకు చికిత్స అందించిన బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌లోని మూడు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందిలో ఆందోళన నెలకొనడంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఆయా ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందికి వ్యాధినిర్ధారణ పరీక్షలకు ఆదేశించింది. కాగా, సిద్దఖీ సంబంధీకులు, ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు, చికిత్స అందించినవారు.. అందరి వివరాలను సేకరించి, వారిని వేరుగా ఉంచి,  నిర్ధారణ పరీక్షలు జరిపే ప్రక్రియను ప్రారంభించామని కర్ణాటక మంత్రి శ్రీరాములు తెలిపారు.

సిద్దిఖీకి ఇప్పటికే రక్తపోటు, మధుమేహం, అస్తమా తదితర ఆరోగ్య సమస్యలున్నాయన్నారు.   వైరస్‌ వ్యాప్తి చెందకుండా సిద్దఖీ మృతదేహాన్ని అన్ని జాగ్రత్తలతో, భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా డిస్పోజ్‌ చేశామని కర్నాటక అంటువ్యాధుల నిరోధక విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ బీజీ ప్రకాశ్‌ తెలిపారు. మృతదేహంపై సూక్ష్మక్రిములను పూర్తిగా నిర్మూలించే ప్రక్రియ జరిపామన్నారు. సిద్దఖీని కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకువెళ్లిన నేపథ్యంలో.. కోవిడ్‌–19 నిర్ధారణ అయిన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశామన్నారు.

వైరస్‌పై ఫోకస్‌
కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రమైన మహమ్మారిగా ప్రకటించడంతో భారత్‌ దీనిపై సమరభేరి మోగించింది. కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుజిల్లాలో పాజిటివ్‌ కేసు నమోదైంది. మరో 13 తాజా కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య 74కి చేరుకుంది. ఈ పరిణామాలతో భారత్‌ తనంతట తానుగా నిర్బంధంలోకి వెళ్లిపోయే దిశగా అడుగులు వేస్తోంది. సరిహద్దులన్నీ మూసి వేసి రాకపోకలపై నిషేధం విధించింది. కరోనాను కట్టడి చేయడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంది. వైరస్‌ విశ్వరూపం చూపిస్తూ ఉండడంతో మంత్రులెవరూ విదేశాలకు ప్రయాణాలు చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. భారీగా హాజరయ్యే కార్యక్రమాలకు ప్రజలందరూ దూరంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు మానుకోవాలని అన్నారు. ఇదే అంశంపై గురువారం ఆయన వరస ట్వీట్లు చేశారు. ‘ఆందోళన చెందాల్సిన పనిలేదు. అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది’’అని ధైర్యం చెప్పారు. (కరోనాతో గాయకుడి హనీమూన్ రద్దు!)

తగ్గిపోతున్న విదేశీ ప్రయాణికులు
కరోనా భయంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య రాన్రానూ తగ్గిపోతోంది. సాధారణ సమయాల్లో రోజూ 70 వేల మంది వచ్చే ప్రయాణికుల సంఖ్య 62 వేలకు పడిపోయిందని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి లోక్‌సభలో చెప్పారు. వీసాల రద్దు, ప్రయాణాలు మానుకోవాలన్న కేంద్రం ప్రకటనలతో వారి సంఖ్య 40 వేలకు పడిపోయే అవకాశం ఉందన్నారు.  

విదేశీ ప్రయాణికులపై నిషేధం లేదు  
కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి విదేశీయులు ఎవరూ రాకుండా పూర్తి స్థాయిలో నిషేధం విధించలేదని విదేశాంగ మంత్రి జైశంకర్‌ గురువారం లోక్‌సభకు చెప్పారు. వారి రాకపోకలపై కొన్ని ఆంక్షలు మాత్రమే విధించామని స్పష్టం చేశారు. చైనా, ఇటలీ, ఇరాన్, దక్షిణకొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీలతో పాటు వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారిని తప్పనిసరిగా విడిగా ఉంచి 14 రోజుల పాటు పర్యవేక్షిస్తామని, మిగిలిన దేశాల నుంచి వచ్చే వారిని అవసరమైతేనే నిర్బంధ కేంద్రాలకు పంపిస్తామన్నారు.

కరోనాపై సమరభేరి..  
► కరోనా వైరస్‌ ముప్పుతో దేశంలోని పలు రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలను మూసివేశాయి. ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలలు, సినిమా థియేటర్లను మార్చి 31 వరకు మూసివేసినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రకటించారు. అత్యధిక కేసులు నమోదైన కేరళలో కూడా విద్యాసంస్థలు, థియేటర్లను ఈ నెలాఖరువరకు మూసివేశారు.  
► భారీ జనసందోహాలను నివారించడం కోసం రాష్ట్రపతి భవన్‌లోకి శుక్రవారం నుంచి సందర్శకులను అనుమతించరు.  
► ఇరాన్, ఇటలీ, కొరియా వంటి దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు కరోనా వైరస్‌ సోకలేదని నిర్ధారణ అయ్యాకే వెనక్కి తీసుకువస్తారు.  
► ఇతర దేశాల నుంచి తీసుకువచ్చే భారతీయుల్ని ఉంచి పర్యవేక్షించడానికి రక్షణ శాఖ మరో ఏడు ప్రాంతాలు, జైసల్మీర్, సూరత్‌గఢ్, ఝాన్సీ, జోధ్‌పూర్, దేవ్‌లలి, కోల్‌కతా, చెన్నైలో ప్రత్యేక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

భారత ప్రధానికి బ్రిటన్‌ పీఎం ఫోన్‌కాల్‌
లండన్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గురువారం భారత ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. కరోనా వైరస్‌ విస్తృతిని అడ్డుకునేందుకు ప్రపంచదేశాలు కలసికట్టుగా తీసుకోవాల్సిన చర్యలను  చర్చించారు. కాగా, కోవిడ్‌కి టీకా కనుగొనేందుకు భారత్‌కు కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎంత యుద్ధ ప్రాతిపదికన కృషి చేసినా.. 18 నెలల్లోపు  వ్యాక్సిన్‌ను కనుగొనడం అసాధ్యమన్నారు.

మరిన్ని వార్తలు