తొలి అండర్‌ వాటర్‌ మెట్రో...వీడియో

8 Aug, 2019 19:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో స్టేషన్ ప్రారంభించనున్నారు. కోల్‌కతాలో దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్ గురువారం ప్రకటించారు. కోల్‌కతా హుగ్లీ నది కింద భారతీయ తొలి అండర్‌వాటర్‌ ట్రైన్‌ నడుస్తుందని పేర్కొన్న ఆయన  ఈ మేరకు  తన అధికారిక ట్విటర్‌లో ఇండియన్ రైల్వే విడుదల చేసిన ఒక వీడియోను పోస్టు చేశారు. అద్భుతమైన ఇంజనీరింగ్‌కు ఇదొక ఉదాహరణ. దేశంలో రైల్వే పురోగతికి చిహ్నం. ఈ సర్వీసుతో కోల్‌కతా ప్రజలు మరింత సౌకర్యవంతంగా ప్రయాణిస్తారు. ఇది దేశం గర్వపడే విషయం అని ఆయన ట్వీట్‌ చేశారు.  

ఈ సర్వీస్ కోల్‌కతా మెట్రో లైన్-2 అంటే ఈస్ట్-వెస్ట్ మెట్రో కిందకు వస్తుంది. 16 కి.మీ లైన్ వరకూ వేయనున్న ఈ ట్రాక్ పనులు రెండు దశలుగా జరుగుతాయి. సాల్ట్ లేక్ సెక్టార్ 5 స్టేషన్‌ను సాల్ట్ లేక్ స్టేడియం స్టేషన్‌తో కలుపుతూ 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొదటి దశ వుంటుంది.  దీన్ని ఈ నెలాఖరు నాటికి ప్రారంభించాలని  రైల్వే శాఖ భావిస్తోంది. ఆ కొత్త మెట్రో మార్గం ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు.  ఈ మెట్రో  సొరంగాల నిర్మాణం ఏప్రిల్ 2017లో చివరలో ప్రారంభం కాగా 30మీటర్ల లోతులో 520 మీటర్ల వరకూ రెండు సొరంగాలు తయారుచేశారు. జర్మనీ నుంచి రచ్నా,  ప్రేర్నా అనే  రెండు టాప్-ఆర్డర్ టన్నెల్ బోరింగ్ యంత్రాలను  తెప్పించారు.  అలాగే  నీరు లీకేజీని నివారించడానికి నాలుగు రక్షణ కవర్లు కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తలు