ఫ్రాన్స్‌లో కంటే భారత్‌లోనే ఎక్కువ అభిమానులు: మోదీ

23 Aug, 2019 18:46 IST|Sakshi

పారిస్‌ : భారత్‌, ఫ్రాన్స్‌లు భవిష్యత్తులో కూడా మిత్రదేశాలుగా కొనసాగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇరు దేశాలు అన్ని అంశాల్లో ఏకాభిప్రాయానికి రావడం హర్షించదగ్గ విషయమన్నారు. మంచి మిత్రులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కలిసుంటారని ఫ్రాన్స్‌లో నివసిస్తున్న భారతీయ ఆత్మీయ సభలో పేర్కొన్నారు. భారత్‌, ఫ్రాన్స్‌ దేశాల స్నేహం గురించి ఆయన వివరిస్తూ ఫ్రెంచ్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు ఫ్రాన్స్‌లో కంటే భారత్ లోనే అభిమానులు ఎక్కువని పేర్కొన్నారు. మోదీ ఫ్రాన్స్‌లోని సెయింట్ గెర్వైస్‌లో విమాన ప్రమాదాలలో మరణించిన వారి స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు.

భారత్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో జరిగిన విమాన ప్రమాదాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలలో ప్రసిద్ద భారత అణుశాస్త్రవేత్త  హోమీబాబా సైతం చనిపోవడం విచారకరమన్నారు. ఇరు దేశాల ప్రమాదాలలో చనిపోయిన వారికి సెల్యూట్‌ చేస్తున్నానని మోదీ అన్నారు. తమ ప్రభుత్వం అసాధ్యమైన లక్ష్యాలను కూడా నెరవేర్చిందని గుర్తుచేశారు. 2030 నాటికి సాధించాల్సిన వాతావరణ లక్ష్యాలను రెండేళ్లలోనే నెరవేరుస్తామని ఉద్ఘాటించారు.

భారత్‌లో స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ముందుందని అన్నారు. అనవసరమైన చట్టాలను తొలగించామని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. ముఖ్యంగా జైశక్తి నిర్మాణం, ముస్లీం మహిళలకు ఇబ్బందిగా మారిన ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేశామని అన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన 900మంది భారత సైనికులను ఆయన గుర్తుచేసుకున్నారు. భారత్‌, ఫ్రాన్స్‌ దేశాలు సామ్రాజ్యవాదానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడాయని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం అంశంలో భారత్‌, ఫ్రాన్స్‌ దేశాలు ముందున్నాయని ప్రస్తుతించారు.
 

మరిన్ని వార్తలు