‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అంటూ నినాదాలు

14 Jan, 2019 09:22 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇండియా గేట్‌ దగ్గర పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేసిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వివరాలు.. ఇండియా గేట్‌ వద్ద రిపబ్లిక్‌ డే రిహార్సల్స్‌ జరుగుతున్నాయి. ఆ సమయంలో ఓ మహిళ అమర్‌ జ్యోతి జవాన్‌ ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె వారిని తోసేసి ముందుకు వెళ్లి ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించింది. ఆమెను అడ్డుకోబోయిన సిబ్బంది మీద దాడి చేస్తూ హల్‌చల్‌ చేసింది. ఎట్టకేలకు మహిళా కానిస్టేబుల్‌ వచ్చి సదరు స్త్రీని పార్లమెంట్‌ స్ట్రీట్‌లోని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అనంతరం సదరు మహిళ గురించి విచారణ చేయగా.. ఆమెది నిజామాబాద్‌ అని.. ముంబైలో ఉంటున్న బంధువులను కలుసుకునేందుకు ఇంట్లో చెప్పకుండా వచ్చిందని తెలిసింది. కానీ అనుకోకుండా ఢిల్లీలో ఆగిపోవాల్సి వచ్చిందని తెలిసింది. ఆమె కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు ఈ విషయం గురించి హైదరాబాద్‌ అధికారులను వాకబు చేయడంతో మహిళకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం సదరు మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె మానసిక స్థితి సరిగా లేదని తెలిసింది. ప్రస్తుతం ఆ మహిళను షెల్టర్‌ హోంలో చేర్చారు.

మరిన్ని వార్తలు