ఇవిగో ఆధారాలు; పాక్‌కు భారత్‌ అల్టిమేటం

28 Feb, 2019 11:26 IST|Sakshi

మసూద్‌  ఆడియో టేపులను పా​కిస్తాన్‌కు అందజేసిన భారత్‌

న్యూఢిల్లీ : భారత్‌తో యుద్ధానికి కాలుదువ్వుతోన్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభించకపోవడంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ శాంతి చర్చలకు సిద్ధమని పేర్కొన్న సంగతి తెలిసిందే. సరైన ఆధారాలు లభిస్తే పుల్వామా ఘటన విషయంలో విచారణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన పలు ఆధారాలను భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు అందజేసింది. 40 మందికి పైగా భారత జవాన్లను హతమార్చిన తర్వాత ఉగ్రవాదులతో జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ మాట్లాడిన టేపులను పాక్‌ అధికారులకు పంపించింది.

కాగా పుల్వామా దాడిని సమర్థవంతంగా అమలు చేసినందుకు తన అనుచరులను మసూద్‌ అభినందించాడు. తాను అప్పగించిన పనిని విజయవంతంగా నిర్వహించినందుకు వారిని ప్రశంసించాడు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులను పాక్‌ అధికారులకు ఇచ్చిన భారత్‌ తక్షణమే మసూద్‌పై చర్యలు తీసుకోవాలని ఆల్టిమేటం జారీ చేసింది.
(చదవండి : ‘ఒక్క చెంప దెబ్బ చాలు.. నా వెనుక ఐఎస్‌ఐ ఉంది’)

మరోవైపు మసూద్‌ అజహర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు ఐక్యరాజ్యసమితిని కోరాయి. మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించాలని, ఆయన ఆస్తులను సీజ్‌ చేయాలని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు పదిహేను మంది సభ్యులతో కూడిన భద్రతా మండలి శాంక్షన్స్‌ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. బ్రిటన్‌,అమెరికా, ఫ్రాన్స్‌ల వైఖరిపై చైనా, రష్యా ఇంకా స్పందించలేదు. కాగా ఏకాభిప్రాయంపై నిర్ణయం తీసుకునే కమిటీలో ఈ ప్రతిపాదనపై మార్చి 13లోగా సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. అయితే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత డిమాండ్‌పై చైనా ప్రతికూలంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో చైనా ఎటువంటి నిర్ణయం తీసుకుంటదనే విషయం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు