ఇండియానే క్లీన్‌ చిట్‌ ఇచ్చింది

4 Aug, 2018 03:00 IST|Sakshi
మెహుల్‌ చోక్సీ (ఫైల్‌)

తరువాతే మేం పౌరసత్వం ఇచ్చాం

చోక్సీపై ఆంటిగ్వా ప్రభుత్వ వివరణ

అప్పటికి చోక్సీపై కేసులేం లేవన్న ప్రభుత్వం  

న్యూఢిల్లీ: తాము విచారణ చేసినప్పుడు మెహుల్‌ చోక్సీకి భారత్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని, ఆ తరువాతే చోక్సీకి పౌరసత్వం ఇచ్చామని ఆంటిగ్వా ప్రభుత్వం వెల్లడించింది. చోక్సీకి పౌరసత్వం మంజూరు చేయడంలో తామేమీ తప్పు చేయలేదని స్పష్టం చేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ భారీ కుంభకోణంలో నీరవ్‌ మోదీ, ఆయన మేనమామ మెహుల్‌ చోక్సీ వాంటెడ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 2017 మేలో పౌరసత్వం కోసం చోక్సీ దరఖాస్తు చేసుకోగా, భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) క్లీన్‌ చిట్‌ ఇచ్చాయని ఆంటిగ్వా ప్రభుత్వం పేర్కొంది.  తర్వాతే చోక్సీకి పౌరసత్వం ఇచ్చామని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో మోదీ ప్రభుత్వ తీరు తేటతెల్లమవుతోందని కాంగ్రెస్‌ విమర్శించింది.   

అసలేం జరిగింది...
ఆంటిగ్వా అండ్‌ బార్బుడా సిటిజన్‌షిప్‌ బై ఇన్వెస్ట్‌మెంట్‌ యూనిట్‌ (సీఐయూ) చోక్సీకి సంబంధించి స్థానిక మీడియాకు విడుదల చేసిన సుదీర్ఘ ప్రకటనలో పలు వివరాలు వెల్లడించింది. ‘2018 జనవరి మొదటి వారంలో చోక్సీ భారత్‌ను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. 2017 మేలో చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. పలు విచారణలు చేసి అన్నింటిలో క్లీన్‌ చిట్‌ వచ్చాకే కిందటేడాది నవంబర్‌లో దాన్ని ఓకే చేశాము. ఇందుకోసం ఆయన ఇన్వెస్ట్‌మెంట్‌ పాలసీ కింద రూ.1.3 కోట్లు చెల్లించారు. అంతేకాదు ఈ ఏడాది జనవరి 15న ఆయన ఆంటిగ్వా పౌరుడిగా విధేయతా ప్రమాణం చేశారు. ఇది జరిగిన 15 రోజుల తరువాత అంటే జనవరి 29న కేంద్ర నేర పరిశోధన సంస్థ (సీబీఐ) నీరవ్‌ మోదీ, చోక్సీపై కేసులు నమోదు చేసి, విచారణ ప్రారంభించింది. చోక్సీ ప్రస్తుతం మా దేశ పౌరుడు కనుక ఆయనను దేశం నుంచి పంపించలేం’ అని వివరించింది. ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేయడంలో పొరపాటు జరగలేదని పేర్కొంది. ఆయనకు మంజూరు చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే చట్టబద్ధమైన ప్రక్రియను చేపట్టవలసి ఉంటుందని, ఆయన ప్రస్తుతం ఆంటిగ్వా చట్టాల రక్షణలో ఉన్నారని తెలిపింది. ఆంటిగ్వా ప్రధాన మంత్రి గాస్టన్‌ బ్రౌనే మాట్లాడుతూ తన చేతులు కట్టేసి ఉన్నాయన్నారు.  

చోక్సీకి క్లీన్‌ చిట్‌ ఎలా ఇచ్చారు?
చోక్సీపై పలు ఫిర్యాదులుండగా విదేశీ వ్యవహారాల శాఖ క్లీన్‌ చిట్‌ ఎలా ఇచ్చిందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. ఈ ఉదంతం దోపిడీదారుల పట్ల మోదీ ప్రభుత్వ తీరును తేటతెల్లం చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఏప్రిల్‌లో ఆంటిగ్వా ప్రధాన మంత్రి గాస్టన్‌ బ్రౌనేని కలిసినప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

అప్పట్లో కేసుల్లేవు కాబట్టే పీసీసీ ఇచ్చాం
ఆంటిగ్వా ప్రభుత్వం విచారణ చేసినప్పుడు మెహుల్‌ చోక్సీపై కేసులేం లేవని భారత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముంబై పాస్‌పోర్టు కార్యాలయం అప్పటి పోలీస్‌ వెరిఫికేషన్‌ రిపోర్టు (పీవీఆర్‌)ను అనుసరించి 2016 మార్చి 16న చోక్సీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. అప్పటికి అతనిపై కేసులేం లేనందున అతనికి పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ (పీసీసీ) ఇచ్చారని తెలిపారు. చోక్సీకి సంబంధించి తామేం క్లీన్‌ చిట్‌ ఇవ్వలేదని, అసలు ఆంటిగ్వా నుంచి తమకు ఎలాంటి అభ్యర్థనా రాలేదని, తాము వారికి ఏ సమాచారం ఇవ్వలేదని సెబీ తెలిపింది.

మరిన్ని వార్తలు