'అవరోధ రాజకీయాలు వద్దు'

18 Mar, 2015 01:52 IST|Sakshi
'అవరోధ రాజకీయాలు వద్దు'
  •  ప్రతిపక్షాలకు అరుణ్‌జైట్లీ విజ్ఞప్తి
  •  ఉద్యోగాలు, మౌలికవసతులు, సంక్షేమానికే మరిన్ని విదేశీ పెట్టుబడులు
  • న్యూఢిల్లీ: ఇప్పుడు దేశం వృద్ధి చెందడానికి చారిత్రక అవకాశం ఉందని.. జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఏడాది 8 శాతాన్ని మించిపోయి, చైనాను కూడా అధిగమిస్తుందన్న అంచనాలు ఉన్నాయని.. ఈ పరిస్థితుల్లో విపక్షం అవరోధ పాత్ర పోషించరాదని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. భూసేకరణ బిల్లు (సవరణ), బొగ్గు బిల్లు, గనులు, ఖనిజాల బిల్లు వంటి కీలకమైన ఆర్థిక సంస్కరణల బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉన్న నేపథ్యంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ముకుళిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తున్నా.. అవరోధవాద రాజకీయాలను తరువాతి దశకు వెళ్లనీయకండి’ అని అన్నారు. మంగళవారం లోక్‌సభలో వినియోగ బిల్లుపై చర్చకు జైట్లీ సమాధానమిచ్చారు. అనంతరం ఈ బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది.

    జైట్లీ ఏమన్నారంటే..  

    •  కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి నాలుగేళ్లలో 25 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించటంతో ప్రభుత్వం ధనిక అనుకూల ప్రభుత్వమన్న ఆరోపణలను ఆయన తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని గత యూపీఏ సర్కారులో నాటి ఆర్థికమంత్రి పి.చిదంబరం రూపొందించిన ప్రత్యక్ష పన్నుల నియమావళి  నుంచే తీసుకున్నానన్నారు.  
    •  మరిన్ని రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రయత్నాలను సమర్థించుకుంటూ.. ఉద్యోగాల సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమానికి చాలా నిధులు అవసరమని పేర్కొన్నారు.
    •  రెండేళ్ల బడ్జెట్‌లలో రూ. 1,70,000 మేర ఆదాయపన్ను చెల్లింపుదారుకు మినహాయింపు ఇచ్చామన, పెన్షన్‌లో రూ. 50,000 వరకూ పెట్టుబడుల పైనా పన్ను మినహాయింపు ఇచ్చామని తెలిపారు.  
    •  నల్లధనంపై ఈ సమావేశాల్లోనే కొత్త చట్టాన్ని తీసుకువస్తామని చైప్పారు. సభలో 162 మంది మాట్లాడారని అయితే ఎవరూ అవినీతిపై మాట్లాడలేదన్నారు.  
    •  బొగ్గు గనుల స్కాంలో మన్మోహన్‌సింగ్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసిన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘మనం పాఠాలు నేర్చుకోవాలి. మాజీ ప్రధానికి సమన్లు జారీ చేసే పరిస్థితి ఉండకూడద’న్నారు.

     పొడిగింపుపై నేడు నిర్ణయం
     కీలక బిల్లుల ఆమోదానికి సమయం లేకపోవడంతో పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలను పొడిగించాలా లేకపోతే షెడ్యూలు ప్రకారం ఈ నెల 20కే ముగించాలా అనే దానిపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నేడు నిర్ణయం తీసుకోనుంది.

మరిన్ని వార్తలు