నెతన్యాహుకు ఆత్మీయ స్వాగతం

15 Jan, 2018 03:26 IST|Sakshi

ప్రొటోకాల్‌ పక్కనపెట్టి ఇజ్రాయెల్‌ ప్రధానికి మోదీ స్వాగతం

ఆరు రోజుల పర్యటనకు భారత్‌కు వచ్చిన నెతన్యాహు

మోదీ, నెతన్యాహు సమక్షంలో తీన్‌ మూర్తి చౌక్‌ పేరు మార్పు

న్యూఢిల్లీ: ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు భారత్‌ చేరుకున్నారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి.. ఢిల్లీ విమానాశ్రయంలో నెతన్యాహుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఆయనను హత్తుకుని భారత పర్యటనకు సాదరంగా ఆహ్వానించారు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై భారత్, ఇజ్రాయెల్‌లు సంతకాలు చేయనున్నాయి. ముంబై, ఆగ్రా, గుజరాత్‌లో నెతన్యాహు పాల్గొనే కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరవుతారు.

నెతన్యాహు పర్యటనపై మోదీ స్పందిస్తూ.. ‘నా స్నేహితుడు నెతన్యాహుకు స్వాగతం..  భారత్‌లో మీ పర్యటన చరిత్రాత్మకమే కాకుండా ప్రత్యేకమైంది. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని మరింత బలోపేతం చేస్తుంది’ అని ట్వీట్‌ చేశారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో  భేటీ సందర్భంగా.. తనకు లభించిన అపూర్వ స్వాగతానికి నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం రాత్రి నెతన్యాహు, ఆయన సతీమణికి ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇచ్చారు.  

తీన్‌ మూర్తి–హైఫా చౌక్‌గా పేరు మార్పు
అంతకుముందు సెంట్రల్‌ ఢిల్లీలోని తీన్‌ మూర్తి చౌక్‌ మెమోరియల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ, నెతన్యాహు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ చౌక్‌ పేరును అధికారికంగా తీన్‌ మూర్తి– హైఫా చౌక్‌గా మార్చారు. ఇజ్రాయెల్‌ నగరం హైఫా విముక్తి కోసం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమరులైన భారతీయ సైనికులకు ఇరువురు నేతలు నివాళులర్పించారు. తీన్‌ మూర్తి మెమోరియల్‌లోని సందర్శకుల పుస్తకంలో సంతకాలు చేశారు.

‘హైఫా నగరం విముక్తికి మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికుల నిస్వార్థ త్యాగానికి నేను సెల్యూట్‌ చేస్తున్నా. ఇజ్రాయెల్‌ ప్రధాని సమక్షంలో వీర సైనికులకు నివాళులర్పిస్తున్నాం. ఈ చరిత్రాత్మక దినాన ఈ ప్రాంతానికి తీన్‌ మూర్తి–హైఫా చౌక్‌గా నామకరణం చేస్తున్నాం.’ అని సందర్శకుల పుస్తకంలో మోదీ రాశారు. తీన్‌మూర్తి చౌక్‌లోని మూడు కాంస్య విగ్రహాలు.. ‘15వ ఇంపీరియల్‌ సర్వీస్‌ బ్రిగేడ్‌’కు చెందిన హైదరాబాద్, జోధ్‌ఫూర్, మైసూర్‌ సైనికులకు ప్రతీక. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సెప్టెంబర్‌ 23, 1918న హైఫాకు ఒట్టొమాన్, జర్మనీ బలగాల నుంచి ఈ బ్రిగేడ్‌ విముక్తి కల్పించింది.  

పలు కీలక ఒప్పందాలపై సంతకాలు
ఈ పర్యటనలో భాగంగా మోదీ, నెతన్యాహులు వివిధ అంశాలపై విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు. ఢిల్లీ, ఆగ్రా, గుజరాత్, ముంబైలో నెతన్యాహు పర్యటిస్తారు. చమురు, సహజవాయువు, పునరుత్పాదక ఇంధనం, సైబర్‌ భద్రత, తదితర ఎంఓయూలపై ఇరు దేశాలు సంతకాలు చేస్తాయి.  

15 ఏళ్ల తర్వాత..
15 ఏళ్ల అనంతరం ఇజ్రాయెల్‌ ప్రధాని ఒకరు భారత్‌లో పర్యటిస్తున్నారు. 2003లో అప్పటి ఇజ్రాయెల్‌ ప్రధాని ఏరియల్‌ షరన్‌ భారత్‌లో పర్యటించారు. ఆరు నెలల క్రితం ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనతో ఆ దేశంతో సంబంధాలు బలపడ్డాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరిగాక ఆ దేశంలో పర్యటించిన తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం.  

మరిన్ని వార్తలు