భారత్, పాక్‌ చేతులు కలిపేనా?

9 Jun, 2017 19:00 IST|Sakshi
భారత్, పాక్‌ చేతులు కలిపేనా?

న్యూఢిల్లీ: చైనా నాయకత్వంలోని షాంఘై సహకారం సంఘం (ఎస్‌సీఓ)లో 17 నెలల నిరీక్షణ అనంతరం భారత్‌కు సభ్యత్వం లభించింది. రష్యా, చైనా సూచనల మేరకే 2014లో ఈ సహకార సంఘం సభ్యత్వానికి భారత్‌ దరఖాస్తు చేసుకొంది. వాస్తవానికి ఈ సభ్యత్వం కోసం భారత్‌ ఎప్పటి నుంచో నిరీక్షిస్తోంది. 2005లోనే ఈ సంఘంలో భారత్‌లో పరిశీలక హోదా పొందింది. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం లాగా ఇది ఓ భౌగోళిక ప్రాధాన్యత గల సంఘం కాదు?


మరి షాంఘై సహకార సంఘం సభ్యత్వం వల్ల భారత దేశానికి కలిగే ప్రయోజనాలేమిటీ? ఈ సంఘం చాప్టర్‌ ప్రకారం సభ్య దేశాలు రక్షణ రంగంలో ప్రధానంగా పరస్పరం సహకరించుకోవాలి. ప్రతి సభ్య దేశం మరో దేశంలో సంయుక్తంగా సైనిక విన్యాసాలు జరపాలి. అంటే భారత దేశం వెళ్లి పాకిస్తాన్‌లో, పాకిస్తాన్‌ వచ్చి భారత్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించాలి. నిత్యం సరిహద్దుల్లో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటున్న ఇరు దేశాల సైనికుల మధ్య ఈ సరికొత్త బంధం ఏర్పడుతుందా? అన్నది ప్రస్తుతానికి అనుమానమే.
 
షాంఘై సంఘం సభ్యత్వం సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సభ్య దేశాలన్నీ ఉమ్మడిగా ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. అటు పాకిస్తాన్‌ను ఇటు భారత దేశాన్ని వేదిస్తున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇరుదేశాల సైన్యం ఏకమైతే అంతకంటే జరిగే మేలు మరొకటి ఉంది. ముఖ్యంగా ఇది నెరవేరాలన్నా ఉద్దేశంతోనే చైనా అటు పాకిస్తాన్‌ను, ఇటు భారత్‌ను సంఘంలోకి ఆహ్వానించింది.

పాకిస్తాన్‌ మీదుగా వెళుతున్న చైనా ఆర్థిక కారిడార్‌కు ఇరుదేశాల మధ్య శాంతియుత పరిస్థితులు, ముఖ్యంగా చైనా కారిడార్‌ వెళ్లే పాకిస్తాన్‌ భూభాగంలో అల్లర్లు జరుగకూడదు. అందుకనే ‘చైనా సింగిల్‌ రూట్, సింగిల్‌ బెల్ట్‌’ ప్రాజెక్టులో భారత్‌ చేరకపోయినప్పటికీ షాంఘై సంఘంలో మనకు ఉచితాసనం ఇచ్చింది. వాస్తవానికి చెప్పాలంటే నార్త్‌ అట్లాంటిక్‌ దేశాల మధ్య సైనిక సహకారం కోసం ఏర్పాటైన ‘నాటో’ లాంటి అంతర్జాతీయ సంస్థలకు పోటీకాగానే చైనా ఈ సహకార సంఘాన్ని తీసుకొచ్చింది.

>
మరిన్ని వార్తలు