10 లక్షలమందికి 18 మందే

4 Aug, 2016 19:21 IST|Sakshi
10 లక్షలమందికి 18 మందే

న్యూఢిల్లీ: దేశంలో సత్వర న్యాయ సేవలు అందకపోవడానికి కారణం న్యాయమూర్తుల కొరతే అని మరోసారి స్పష్టమైంది. దేశ జనాభాను ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల సంఖ్యను పోల్చి చూస్తే ఈ విషయం తేటతెల్లమైంది. పది లక్షల మంది జనాభాకు కేవలం 18మంది జడ్జిలు మాత్రమే న్యాయసేవలు అందించేందుకు ఉన్నారని న్యాయశాఖ వద్ద ఉన్న సమాచారం ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి లా కమిషన్ 1987వ సంవత్సరంలో ఇచ్చిన తన నివేదికలో ఈ సంఖ్య కనీసం 50 ఉండాలని చెప్పింది.

దీని ప్రకారం ఉన్నపలంగా న్యాయమూర్తుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. ఇక రాష్ట్రాల వారిగా చూసుకుంటే తమ జనాభా నిష్పత్తితో పోల్చినప్పుడు హర్యానా ఎక్కువగా 57.74శాతం న్యాయమూర్తులను కలిగి ఉండగా ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ 47.33శాతం, ఉత్తరప్రదేశ్ 10.54శాతం న్యాయమూర్తులను కలిగి ఉంది. అతి ఎక్కువ జనాభా ఉండి తక్కువమంది న్యాయమూర్తులు కలిగిన రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ ఉంది. మరోపక్క, 2009లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 25 ఉండగా ప్రస్తుతం ఒక ప్రధాన న్యాయమూర్తితో సహా 31మంది ఉన్నారు.

మరిన్ని వార్తలు