పది లక్షల మందికి 19 మంది జడ్జీలు

25 Sep, 2018 05:14 IST|Sakshi

కేంద్ర న్యాయశాఖ నివేదిక

న్యూఢిల్లీ: దేశంలో ప్రతి పది లక్షల మందికి సరాసరిన 19 మంది చొప్పున జడ్జీలున్నారని కేంద్ర న్యాయ శాఖ వెల్లడించింది. దిగువ కోర్టుల్లోని ఐదు వేల మందితోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 6వేల మంది జడ్జీల కొరత ఉందని స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో చర్చ కోసం రూపొందించిన ఈ నివేదికను న్యాయ శాఖ ఈ ఏడాది మార్చిలో తయారు చేసింది. దీని ప్రకారం దేశంలో జడ్జీలు– ప్రజల నిష్పత్తి 10,00,000:19.49గా ఉంది.
దిగువ కోర్టుల్లో 5,748, హైకోర్టుల్లో 406 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దిగువ కోర్టుల్లో ఆమోదిత సిబ్బంది సంఖ్య 22,474 కాగా ప్రస్తుతం 16,726 మందే పనిచేస్తున్నారు.

అలాగే, హైకోర్టుల్లో 1079 గాను ప్రస్తుతం 673 మంది సిబ్బందే ఉన్నారు. సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులకు గాను 25 మంది ఉన్నారు. ప్రతి పది లక్షల మంది ప్రజలకు 50 మంది జడ్జీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని 1987లోనే న్యాయ కమిషన్‌ ప్రతిపాదించగా ఇప్పటికీ ఆ పరిస్థితి మారలేదని 2016లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జడ్జీల పోస్టుల్లో ఖాళీల కారణంగా దేశ వ్యాప్తంగా జిల్లా, దిగువ స్థాయి కోర్టుల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య 2.76 కోట్లకు చేరిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఇటీవల తెలిపారు.

మరిన్ని వార్తలు