వైద్యరంగంలో అద్భుతానికి భారత్ వేదిక

31 May, 2016 19:04 IST|Sakshi
వైద్యరంగంలో అద్భుతానికి భారత్ వేదిక

న్యూఢిల్లీ: బ్రెయిన్ డెడ్ రోగులు తిరిగి ప్రాణం పోసుకున్న సందర్భాలు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేవు. అలాంటి రోగులపై వైద్య పరీక్షలు నిర్వహించడం పలు దేశాల్లో చట్ట విరుద్ధం, అనైతికం కూడా. అలాంటి రోగుల చచ్చిన మెదళ్లపై తాను ప్రయోగాలు నిర్వహించడమే కాకుండా, వారికి తిరిగి ప్రాణం పోస్తానని చెబుతున్నారు ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌కు చెందిన డాక్టర్ హిమాంషు బన్సల్. తనను తాను ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఇసాక్ న్యూటన్‌తో పోల్చుకునే డాక్టర్ బన్సల్ స్వతహాగా ఆర్థోపెడీషియన్. తన  రివిటలైఫ్ సెన్సైస్ కంపెనీ తర ఫున వైద్య రంగంతో వినూత్న ప్రయోగాలు నిర్వహించడం ఆయనకు అలవాటే.

బ్రెయిన్ డెడ్‌కు పునర్ ప్రాణంపోసే తన ప్రాజెక్టుకు డాక్టర్ బన్సల్ ‘రీ ఎనిమా ప్రాజెక్ట్’ అని  పేరుకూడాపెట్టారు. ఈ ప్రాజెక్టు గురించి విన్న తోటి డాక్టర్లే నవ్వుతున్నారు. కొందరు ఇది వృధా ప్రయాస అని వాదిస్తుండగా, ఇది అనైతికమని మరికొందరు వాదిస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా డాక్టర్ బన్సల్ తన ప్రయోగానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయంలో అమెరికాలోని బయోటెక్ సంస్థ బయోక్వార్క్‌తో ఒప్పందం కూడా చేసుకున్నారు.

 జన్యు కణాల చికిత్స, లేజర్ చికిత్సలతోపాటు నరాల్లో ఉత్ప్రేరణ కల్పించడం ద్వారా చచ్చిన మెదడుకు ప్రాణం తెప్పించేందుకు కృషి చేస్తున్నానని డాక్టర్ బన్సల్ తెలిపారు. బ్రెయిన్ డెడ్ రోగులపై ఇలాంటి ప్రయోగాలు నిర్వహించడం అమెరికాలో చట్ట విరుద్ధమే కాకుండా, అనైతికమని, భారత్‌లో ఇలాంటి ప్రయోగం నిర్వహించేందుకు తాము ముందుకు రావడానికి ఇదో కారణం కాగా, భారత్‌లో వైద్య ఖర్చులు తక్కువవడం మరో కారణమని అమెరికా బయోక్వార్క్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఒక్క రోగిపై ఈ ప్రయోగానికి అమెరికాలో ఆరేడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, అదే భారత్‌లోనైతే అందులో పదోవంతు ఖర్చు అవుతుందని వారు అంటున్నారు.  

 ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో బ్రెయిన్ డెడ్ రోగులు ఎక్కువగా ఉంటున్నారని, అందుకనే తన ప్రయోగానికి ఆ ఊరును ఎన్నుకున్నానని డాక్టర్ బన్సల్ తెలిపారు. తన ప్రయోగానికి ‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ అనుమతి ఉందని ఆయన చెబుతున్నారు. కేవలం డ్రగ్స్‌పై ప్రయోగాలకు మాత్రమే అనుమతి మంజూరుచేసే అధికారం కలిగిన ఈ సంస్థ డాక్టర్ బన్సల్ ప్రయోగానికి ఎలా అనుమతి ఇచ్చిందో అర్థంకాని విషయం. ఇదే విషయమై భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్‌ను సంప్రదించగా తమకు ఇలాంటి ప్రయోగాలపై నియంత్రణాధికారాలు లేవని అన్నారు. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)యే ఏవైనా చర్యలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. తమకూ తగిన రెగ్యులేటరీ అధికారాలు లేవని ఇటీవల వైద్య కళాశాలల కేసు విషయంలోనే సుప్రీం కోర్టుకు విన్నవించుకున్న ఎంసీఐ ఈ విషయంలో చర్యలు తీసుకుంటుందన్న నమ్మకం లేదు.

 ‘ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు. నేను బతికున్న మనుషులపై ప్రయోగాలు చేయడం లేదు. శ్మశానానికి వెళుతున్న బ్రెయిన్ డెడ్ రోగులపైనే ప్రయోగాలు చేస్తానంటున్నాను. మహా అంటే వారు శ్మశానానికి వెళ్లడం 15 రోజులు ఆలస్యం అవుతుంది. ప్రయోగం సక్సెస్ అయితే వైద్య చరిత్రలోనే అదో అద్భుతం అవుతుంది’ అని బన్సల్ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు