ఆకాశమంత.. సాహసం!

2 Dec, 2018 05:02 IST|Sakshi

ఆమె ఆకాశంలో సగం.. సాహసంతో సావాసం..అవకాశాలను అందిపుచ్చుకుంటూ పైలట్లుగా రాణిస్తున్న మహిళలు..మహిళా పైలట్లలో భారత్‌ నంబర్‌ వన్‌  
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా మహిళా పైలట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఎక్కువ మంది మహిళా పైలట్లు ఉన్న దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. దేశంలోని మొత్తం 8,797 మంది పైలట్లలో మహిళల సంఖ్య 1,092 (12.4%) మందికి చేరింది. వీరిలో 355 మంది కెప్టెన్లు. ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ విమెన్‌ ఎయిర్‌లైన్‌ పైలట్స్‌ (ఇస్వాప్‌) ఇటీవల ఈ గణాంకాలు వెలువరించింది. వీటి ప్రకారం.. మహిళా పైలట్ల ప్రపంచ సగటు 5.4% మాత్రమే. ఇండిగోలోని మొత్తం 2,689 మంది పైలట్లలో 351 మంది (13.9%) మహిళలు. జెట్‌ ఎయిర్‌వేస్‌లోని 1,867 మందిలో 231 మంది మహిళా పైలట్లే (12.4%). 853 మంది పైలట్లు వున్న స్పైస్‌ జెట్‌ (113మంది – 13.2%), 1710 మంది పైలట్లు ఉన్న ఎయిర్‌ ఇండియాలో (217–12.7%) కూడా మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. ఢిల్లీకి చెందిన ‘జూమ్‌ ఎయిర్‌’అత్యధిక మహిళా పైలట్లకు ఉద్యోగాలిచ్చింది. ఇక్కడ పని చేసే మొత్తం 30 మంది పైలట్లలో 9 మంది మహిళ లు. అమెరికాలో మహిళా పైలట్ల సంఖ్య ప్రపంచ సగటు కంటే తక్కువే (4.4%). అమెరికాలోని యు నైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌లో అత్యధికంగా 7.5% మంది, డెల్టాలో 4.7% మంది మహిళా పైలట్లు పని చేస్తున్నారు. యూకేలో 4.77% మహిళా పైలట్లే ఉన్నారు.  

భారత్‌.. బిగ్‌ మార్కెట్‌
మధ్య తరగతి అంతకంతకు పెరుగుతున్న భారతదేశంలో విమాన ప్రయాణాలూ పెరుగుతాయని బోయింగ్‌ కంపెనీ వెలువరించిన కమర్షియల్‌ మార్కెట్‌ అవుట్‌ లుక్‌ రిపోర్ట్‌– (2018– 2037) చెబుతోంది. రానున్న 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 7,90,000 మంది పైలట్లు అవసరమని ఆ కంపెనీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పైలట్ల కొరత ఏర్పడే పరిస్థితి ఉన్నందున భారతీయ కంపెనీలు మహిళల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయని అంటోంది ఇస్వాప్‌. 

సమాన వేతనాలు
స్త్రీ పురుషుల మధ్య వేతన వ్యత్యాసాలు లేని రంగాలు అరుదే. అలాంటి వాటిలో విమానయాన రంగమొకటి. ఇండిగో కంపెనీ పిల్లలున్న తల్లిదండ్రులకు డే కేర్‌ సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు గర్భిణులకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తోంది. మెటర్నిటీ లీవ్‌ విధానాన్ని తప్పనిసరి చేసింది. ‘నిర్భయ’ఘటన తర్వాత ఎయిర్‌లైన్‌ కంపెనీలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. రాత్రి ఆరు– తెల్లవారు జాము ఆరు గంటల మధ్య మహిళా పైలట్లను ఇళ్ల నుంచి స్వయంగా తీసుకెళ్లడం.. తిరిగి దిగబెట్టడంతో పాటు, బాడీ గార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఇది సురక్షిత ఉద్యోగమని, ఇతర చోట్ల కంటే మహిళలను ఇక్కడ మరింత భద్రంగా చూసుకుంటారని జెట్‌ ఎయిర్‌వేస్‌ సీనియర్‌ ట్రైనర్‌ శ్వేతా సింగ్‌ చెప్పారు. ప్రస్తుతం విమానయాన మార్కెట్‌ మంచి ఊపు మీద ఉందని, అక్కడ సులువుగా పని దొరుకుతుందని అంటున్నారు ఇండిగో పైలట్‌ రూపీందర్‌ కౌర్‌. 

సాహసమే శ్వాసగా.. 
అనుపమ కోహ్లీ.. ఎయిర్‌ ఇండియా కెప్టెన్‌. గత ఫిబ్రవరిలో ఆమె కనబరచిన సమయస్ఫూర్తి పెద్ద ప్రమాదాన్ని తప్పించగలిగింది. ఆమె నడుపుతున్న ఎయిర్‌ ఇండియా 631 విమానం.. విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానం అతి సమీపంలో ఎదురెదురుగా వచ్చాయి. పైలట్లను హెచ్చరిస్తూ ఆటోమేటిక్‌ వార్నింగ్‌లు వెలువడ్డాయి. అనుపమ రెజల్యూషన్‌ అడ్వయిజరీ సూచనల మేరకు క్షణాల్లో అప్రమత్తమై విమానాన్ని ఎత్తుకు తీసుకెళ్లడం ద్వారా భారీ ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. ‘ఎయిర్‌ ఇండియా’సహా పలువురి అభినందనలందుకున్నారు. ఆ సమయంలో విస్తారాలో 152 మంది, ఎయిర్‌ ఇండియా విమానంలో 109 మంది ప్రయాణిస్తున్నారు.

మరిన్ని వార్తలు