యురేనియం దిగుమతులపై భారత్‌ దృష్టి

24 Sep, 2017 23:56 IST|Sakshi

భవిష్యత్ అవసరాలూ ప్రధానమే

ఇంధన అవసరాలకూ ముఖ్యమే

యురేనియం నిల్వలే మీదే మన భవిష్యత్‌

అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణల నేపథ్యంలో భారత్‌ కూడా యురేనియం నిల్వలపై దృష్టి సారించింది. ఉత్తర కొరియా, ఇరాన్‌, పాకిస్తాన్‌ వంటి దేశాలు అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటున్న దశలో.. భవిష్యత్‌ అవసరా దృష్ట్యా ఇతర దేశాల నుంచి యురేనియాన్ని దిగుమతి చేసుకునేందుకు భారత్‌ సమాయత్తమవుతోంది.  అదే సమయంలో అణువిద్యుత్‌ అవసరాల కోసమూ.. యురేనియం నిల్వలు పెంచుకోవడం భారత్‌కు తప్పనిసరి.

సాక్షి, న్యూఢిల్లీ : యురేనియం నిల్వలను పెంచుకునేదిశగా భారత్‌ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఉబ్జెకిస్తాన్‌ సహా ఇతర దేశాల నుంచి యురేనియం నిల్వలను దిగుమతి చేసుకునేందుకు భారత్‌ సమాయాత్తమవుతోంది. యురేనియం నిల్వలు పెంచుకోవడం అనేది.. భారత్‌కు దీర్ఘకాలంలో భద్రతను పెంచుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశంలోని అణు రియాక్టర్లు పూర్తిస్థాయిలో పనిచేయడానికి.. భవిష్యత్‌ అవసరాలకు, ఇతర కారణాల వల్ల యురేనియం నిల్వలను వ్యూహాత్మకంగా పెంచుకోవాలని భారత్‌ భావిస్తోంది. ముఖ్యంగా రాబోయే ఐదేళ్లకు సరిపడా యురేనియాన్ని నిల్వ చేసుకోవాలని.. అప్పుడే మన రియాక్టర్లు పూర్తిస్థాయిలో పనిచేయగలవని.. నిపుణులు చెబుతున్నారు.

భవిష్యత్‌ అవసరాలే..!
యురేనియం విషయంలో 1974 నాటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవడం ప్రధానం. అప్పట్లో పోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించడంతో.. యురేనియంపై అంతర్జాతీయంగా ఆంక్షలు వెల్లువెత్తాయి. యురేనియం సరిపోక రియాక్టర్లు మూతపడ్డాయి. భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితులు తలెత్తకూడదనే నిల్వలను మరింత పెంచుకునేందుకు భారత్‌ సిద్ధమైంది.

ఉబ్జెకిస్తాన్‌ నుంచి..
యురేనియం అమ్మకం కొనుగోళ్ల గురించి ప్రస్తుతం భారత్‌.. ఉబ్జెకిస్తాన్‌తో చర్చలు జరుపుతోంది. ఇందుకు సంబంధించి ఉబ్జెకిస్తాన్‌ బృందం ఒకటి.. గత నెల్లో భారత్‌లో పర్యటించింది. రెండునెలల కిందట షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమావేశాల్లో పాల్గొన్న భారత ప్రధాని మోదీ.. ఉజ్బెక్‌ అధ్యక్షుడు షవాకత్‌ మిర్జయోవ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందులో ప్రధానంగా యురేనియం దిగుమతి గురించి చర్చించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

అప్పట్లో అనాసక్తి.. ఇప్పుడు ఆసక్తి
గతంలో ఉబ్జెకిస్తాన్‌ మనకు యురేనియం ఎగుమతి చేసేందుకు ఆసక్తిని ప్రదర్శించలేదు. అయితే జాతీయంగా, అంతర్జాతీయంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో నేడు యురేనియాన్ని ఎగుమతి చేసేందుకు ఉజ్బెక్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా యురేనియాన్ని ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఉజ్బెకిస్తాన్‌ ఏడో స్థానంలో ఉన్నట్లు వరల్డ్‌ న్యూక్లియర్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌ ఖజకిస్తాన్‌, కెనడాల నుంచి అత్యధికంగా యురేనియాన్ని దిగుమతి చేసుకుంటోంది.

ఉజ్బెక్‌ నుంచి యురేనియం వస్తే..!
ఉజ్బెకిస్తాన్‌ నుంచి యురేనియం దిగముతి అయితే.. భారత్‌కు చాలా వరకు ఖర్చులు తగ్గుతాయి. ప్రధానంగా నాణ్యమైన యురేనియం లభించడంతో పాటు.. రవాణా ఖర్చులు తగ్గుతాయి. అదే సమయంలో భారత్‌ కొత్తగా చేపట్టిన 7 వేల మెగావాట్ల అణువిద్యుత్‌ ప్లాంట్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఇప్పటికే పనిచేస్తున్న 22 అణు రియాక్టర్ల కెపాసిటీని మరింత పెంచుకోవడం సాధ్యమవుతుంది.

మరిన్ని వార్తలు