ఎస్‌సీవో సభ్య దేశంగా భారత్

11 Jul, 2015 04:07 IST|Sakshi
ఎస్‌సీవో సభ్య దేశంగా భారత్

- ఇప్పటిదాకా పరిశీలక హోదా మాత్రమే
- కూటమిలోని దేశాలకు మోదీ కృతజ్ఞతలు
 
ఉఫా(రష్యా):
షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీవో)లో భారత్‌కు ఇకపై పూర్తిస్థాయి సభ్యత్వం దక్కనుంది. గత పదేళ్లుగా ఈ కూటమిలో భారత్‌కు పరిశీలక దేశం హోదా మాత్రమే ఉంది. చైనా రాజధాని బీజింగ్ కేంద్రంగా ఉన్న ఎస్‌సీవోలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లు సభ్య దేశాలుగా ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ కూటమిలో భారత్ కూడా చేరనుంది. పాకిస్తాన్‌ను కూడా సభ్య దేశంగా చేర్చుకోనున్నారు.

‘భారత్‌ను పూర్తిస్థాయి సభ్య దేశంగా చేర్చుకునేందుకు అంగీకరించిన ఎస్‌సీవో దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇది ఎస్‌సీవో సభ్య దేశాలతో ఉన్న సహజ సంబంధాలకు పొడిగింపు మాత్రమే. ఇది ఈ ప్రాంతంలో శాంతి, సంపద సృష్టికి ఎంతగానో దోహదపడుతుంది. కూటమిలో చేరబోయే పాక్‌కు కూడా అభినందనలు తెలుపుతున్నా’ అని శుక్రవారమిక్కడ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

అంతకుముందు మోదీతోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సమక్షంలో సదస్సు జరిగింది. ఈ సమావేశంలో.. ఎస్‌సీవోలో భారత్‌కు సభ్యదేశం హోదా కల్పించాలని నిర్ణయించారు. ఎస్‌సీవో కూటమిలో 2005 నుంచి భారత్ పరిశీలక దేశంగా వ్యవహరిస్తోంది. పూర్తిస్థాయి సభ్య దేశంగా పరిగణించాలని కిందటేడాదే కూటమిని భారత్ కోరింది. ఉగ్రవాదంపై పోరు, ఇంధన రంగంలో సహకారం, ప్రాంతాల అనుసంధానం, వాణిజ్య బంధాల బలోపేతం, మత్తుపదార్థాల అక్రమ రవాణాకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఎస్‌సీవో ఏర్పడింది.

>
మరిన్ని వార్తలు