‘కర్తార్‌పూర్‌’కు శంకుస్థాపన

27 Nov, 2018 04:49 IST|Sakshi
కారిడార్‌ శంకుస్థాపన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు తదితరులు

భారత్‌–పాక్‌ మధ్య శాంతి నెలకొంటుందని వెంకయ్య ఆకాంక్ష

గురుదాస్‌పూర్‌: పాకిస్తాన్‌లోని గురుద్వార దార్బార్‌ సాహిబ్‌ను సందర్శించే సిక్కు యాత్రికుల సౌకర్యం కోసం ఏర్పాటుచేయనున్న కర్తార్‌పూర్‌ కారిడార్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలపడం విదితమే.16వ శతాబ్దంలో రావి నది ఒడ్డున నిర్మితమైన ఈ గురుద్వార సిక్కులకు చాలా పవిత్రమైనది. సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ దేవ్‌ ఇక్కడే తన జీవితంలోని చివరి 18 ఏళ్లు గడిపారు. దేశ విభజన అనంతరం కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వార పాకిస్తాన్‌కు వెళ్లింది.

భారత్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లా డేరా బాబా నానక్‌ నుంచి కర్తార్‌పూర్‌ నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలోనే రహదారి నిర్మించేందుకు వెంకయ్య శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం వెంకయ్య మాట్లాడుతూ ఈ కారిడార్‌తో ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొంటుందని ఆకాంక్షించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ పాక్‌కు హెచ్చరికలు చేశారు. భారత్‌ శాంతికి ప్రాధాన్యమిస్తుందనీ, కానీ భారత్‌కు భారీ, శక్తిమంతమైన సైన్యం ఉందన్న విషయాన్ని పాక్‌ గుర్తించాలన్నారు. సరిహద్దుల్లో భారత సైనికులపై పాకిస్తాన్‌ ఉగ్రవాదుల, సైనికుల దాడులకు పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వానే కారణమన్నారు.
 

మరిన్ని వార్తలు