దీప యజ్ఞం సక్సెస్‌

6 Apr, 2020 01:15 IST|Sakshi
గాంధీనగర్‌లోని తమ నివాసంలో దీపం పట్టుకున్న ప్రధాని మాతృమూర్తి హీరా బెన్‌, నరేంద్ర మోదీ

కరోనాపై కదనానికి దేశ ప్రజల సంఘీభావం

ప్రధాని మోదీ పిలుపునకు అపూర్వ స్పందన

న్యూఢిల్లీ: దీప కాంతిలో భారతావని వెలుగులీనింది. కరోనా రక్కసి అంతానికి దేశ ప్రజలంతా ఐక్యంగా దీపాలు చేతబూని ప్రతిజ్ఞ చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్‌పై అలుపెరగని పోరుకు సంఘీభావంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘దీప యజ్ఞం’ విజయవంతమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్‌ టార్చ్‌లు వెలిగించి కరోనా రాక్షసిని అంతమొందించే ఉమ్మడి సంకల్పానికి ఘనంగా సంఘీభావం తెలిపారు.

కోట్లాది భారతీయులు ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభించి 9 నిమిషాల పాటు తమ ఇళ్ల ముందు, బాల్కనీల్లో దీపాల వెలుగులను విరజిమ్మి, మహమ్మారిపై పోరులో విజయమే లక్ష్యమని ప్రతిన బూనారు. ప్రధాని మోదీ కూడా తన ఇంటిముందు దీప స్థంభాన్ని వెలిగించి, కరోనాపై కదనంలో ముందుంటానని దేశ ప్రజలకు ధైర్యం చెప్పారు. కేంద్ర మంత్రులు, రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఈ దీప యజ్ఞంలో మమేకమయ్యారు. తమ నివాసాల్లో దీపాలను వెలిగించి, ప్రధాని మోదీ సంకల్పానికి సంఘీభావం తెలిపారు. 

కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బాణాసంచా కాల్చడం, హిందూ ప్రార్థనా గీతాలను, మంత్రాలను వినిపించడం కూడా కనిపించింది. మరికొన్ని చోట్ల జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రజలంతా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు, తమ ఇళ్లల్లోని విద్యుద్దీపాలను ఆర్పేసి, ఇంటి ముందు దీపాలు, కొవ్వొత్తులు, లేదా మొబైల్‌ టార్చ్‌లు వెలిగించి కరోనాను తరిమికొట్టే తమ ఉమ్మడి సంకల్పాన్ని ఘనంగా ప్రకటించాలని శుక్రవారం ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌ సేఫ్‌
దేశవ్యాప్తంగా ఇళ్లల్లో విద్యుద్దీపాలను ఒకేసారి 9 నిమిషాల పాటు ఆర్పేసే కార్యక్రమం జరిగినప్పటికీ.. విద్యుత్‌ గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు.  డిమాండ్‌లో ఒకేసారి భారీగా తగ్గుదల, 9 నిమిషాల అనంతరం ఒకేసారి అదే స్థాయిలో పెరుగుదల చోటు చేసుకున్నప్పటికీ.. ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ శాఖ సిద్ధమై, అవసరమైన చర్యలు తీసుకుందన్నారు. ‘గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. నేను, మా శాఖ కార్యదర్శి, ఇతర సీనియర్‌ అధికారులు స్వయంగా పరిస్థితిని సమీక్షించాం.

సమర్ధవంతంగా ఈ పరిస్థితిని ఎదుర్కొన్న ఎన్‌ఎల్‌డీసీ, ఆర్‌ఎల్‌డీసీ, ఎస్‌ఎల్‌డీసీల్లోని ఇంజినీర్లందరికి అభినందనలు’ అని సింగ్‌ పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్‌ వినియోగం ఒక్కసారిగా 117 గిగావాట్ల నుంచి 85.3 గిగావాట్లకు తగ్గిపోయింది. అంటే 30 గిగావాట్లకు పైగా డిమాండ్‌ తగ్గింది. ఇది మేం తగ్గుతుందని ఊహించిన 12 గిగావాట్ల కన్నా చాలా ఎక్కువ’ అని ఆయన వివరించారు. దీప యజ్ఞం సందర్భంగా ఒకేసారి విద్యుత్‌ వినియోగం తగ్గితే గ్రిడ్‌ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే.

సరుకుల రవాణాకు సహకరించండి
నిత్యావసరాల రవాణాలో కీలకమైన ట్రక్‌ డ్రైవర్లు, ఇతర కూలీలు తమ పని ప్రదేశాలకు వెళ్లేందుకు సహకరించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. అప్పుడే నిత్యావసరాల సరఫరా సజావుగా సాగుతుందని పేర్కొంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు