భారత్ కు 1 బిలియన్ డాలర్ల జరిమానా!

26 Jul, 2016 14:14 IST|Sakshi
భారత్ కు 1 బిలియన్ డాలర్ల జరిమానా!

ది హాగ్: బెంగళూరుకు చెందిన దేవాస్ మల్టీ మీడియాతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు చెందిన ఆంథ్రిక్స్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు భారత్ భారీ మూల్యం చెల్లించుకోనుంది. రెండు కొత్త శాటిలైట్లను తయారుచేసి, వాటి వినియోగానికి ఎస్-బాండ్ స్పెక్ట్రమ్ ను లీజ్ కు ఇచ్చేందుకు దేవాస్ ఆంథ్రిక్స్ తో 2005లో ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో ఇస్రో ద్వారా రెండు కొత్త శాటిలైట్లను నిర్మించి దేవాస్ కు అందించాల్సివుంది. శాటిలైట్ల నిర్మాణ అనంతరం ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్ ద్వారా తక్కువ ఖరీదు కలిగిన సెల్ ఫోన్లకు దేవాస్ బ్రాండ్ బాండ్ సౌకర్యాన్ని ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

12 ఏళ్ల పాటు ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్ ని వినియోగించుకునేందుకు ఆంథ్రిక్స్ కు దేవాస్ రూ.578 కోట్లను చెల్లించింది. అప్పటికే 2జీ స్పెక్ట్రమ్ స్కాంతో సతమతమవుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం 2011 ఫిబ్రవరిలో దేవాస్ తో ఆంథ్రిక్స్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో స్పెక్ట్రమ్ కేటాయింపుల సమయంలో ఆంథ్రిక్స్ దేవాస్ కు ఎటువంటి కేటాయింపులు చేయలేదు.
 
దాంతో చర్యలు చేపట్టిన దేవాస్ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని అర్ధాంతరంగా రద్దు చేయడంపై 2015లో అంతర్జాతీయ ట్రైబ్యునల్ లో కేసు వేసింది. దేవాస్ మల్టీమీడియాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అర్ధాంతరం రద్దు చేయడం వల్ల దేవాస్ లో పెట్టుబడులు పెట్టిన వారందరూ నష్టాలపాలయ్యారని ట్రైబ్యునల్ పేర్కొంది. భారత ప్రభుత్వం దేవాస్ కు అన్యాయం చేసిందని వ్యాఖ్యనించింది. ట్రైబ్యునల్ వ్యాఖ్యలతో అంతర్జాతీయ పెట్టుబడిదారుల వద్ద భారత్ కు ఉన్న కీర్తి పడిపోయే ప్రమాదం ఏర్పడింది. అంతేకాకుండా దాదాపు ఒక బిలియన్ డాలర్ల పరిహారాన్ని భారత ప్రభుత్వం దేవాస్ కు చెల్లించే అవకాశం ఉంది.

ఇస్రోకు చెందిన మాజీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్న దేవాస్ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ తనకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు వారిని ఉపయోగించిందని సమాచారం. దేవాస్ ఒప్పందంపై సంతకం చేసిన అప్పటి ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పుపై స్పందించిన మాధవన్ దేవాస్ తో ఒప్పందం కుదుర్చుకోవడం ఒక ఆలోచన లేని చర్య అని వ్యాఖ్యనించారు.

మరిన్ని వార్తలు