చైనాను కార్నర్‌ చేయనున్న భారత్!

30 Dec, 2016 10:19 IST|Sakshi
చైనాను కార్నర్‌ చేయనున్న భారత్!

న్యూఢిల్లీ: చైనాను భారత్ కార్నర్‌ చేయనుంది. పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టినట్లుగానే చైనాను ఇక తప్పుబట్టనుంది. చైనా తాను చేసిన పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకోకపోతే నిజంగానే ఇక చైనాతో సత్సంబంధాల విషయంలో భారత్‌ దూరం జరగనుంది. జైషే ఈ మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అని, దానిపై నిషేధం విధించి, దాని చీఫ్ మౌలానా మసూద్‌ అజర్‌ను దోషిగా నిలబెట్టాలని భారత్‌ ఈ ఏడాది (2016) మార్చి 31న ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో ప్రవేశపెట్టింది.

అయితే, ఐదుగురు శాశ్వత సభ్యులు, పదిమంది తాత్కాలిక సభ్యులు ఉన్న ఈ మండలిలో ఒక్క చైనా మాత్రమే భారత్‌ ప్రతిపాదనను తోసిపుచ్చింది. అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న భారత్‌ తాజాగా పఠాన్‌ కోట్‌పై దాడి ఘటనకు సంబంధించి ఎన్‌ఐఏ జరిపిన విచారణలో జైషే ఈ మహ్మద్‌ సంస్థకు చెందిన వారే ఈ ఉగ్రదాడికి పాల్పడినట్లు గుర్తించింది. పలు ఆధారాలు సేకరించింది. ఇప్పుడు వాటిని మరోసారి భారత్‌ ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో చైనా ఈసారి కచ్చితంగా భారత్‌ గతంలో చేసిన ప్రతిపాదనను ఆమోదించి తీరాలి. అలా కాకుండా విబేధిస్తే ఇక చైనాను అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టాలని భారత్‌ వ్యూహం. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు ముందునుంచే చైనా మద్దతిస్తోందని ఇప్పటికే పలు సందర్భాల్లో బయటపడిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు