దాతృత్వంలో భారత్‌ అధ్వాన్నం!

14 Nov, 2019 14:54 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌ దాతృత్వంలో బాగా వెనకబడి పోతోంది. గత పదేళ్ల కాలంలో 128 దేశాల్లో భారత్‌కు 82వ స్థానం లభించడమే ఇందుకు ఉదాహరణ. భారతీయుల్లో ప్రతి మూడో వ్యక్తి అపరిచితుడికి సాయం చేయగా, ప్రతి నలుగురిలో ఒకరు డబ్బును దానం చేయగా, ప్రతి ఐదుగురిలో ఒకరు ఇతరుల కోసం స్వచ్ఛందంగా తమ సమయాన్ని కేటాయించారని ‘వరల్డ్‌ గివింగ్‌ ఇండెక్స్‌’ తన పదవ నివేదికలో వెల్లడించింది. దాతృత్వంలో భారత్, పొరుగునున్న పాకిస్థాన్, నేపాల్‌కన్నా వెనకబడి ఉంది.

128 దేశాల్లోని 13 లక్షల మంది అభిప్రాయాలను గత తొమ్మిదేళ్లుగా సేకరించి ‘వరల్డ్‌ గివింగ్‌ ఇండెక్స్‌’ ఈ వివరాలను వెల్లడించింది. ఇటీవల ఎప్పుడైనా అపరిచితులకు ఆర్థిక సహాయం చేశారా? చారిటీ సంస్థలకు సహాయం చేశారా? ఇతరుల సంక్షేమం కోసం స్వచ్ఛందంగా కృషి చేశారా? లాంటి ప్రశ్నల ద్వారా అధ్యయనకారులు తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. ఇతర దేశాలకు సంబంధించి ‘గాలప్‌ వరల్డ్‌ పోల్‌’, ‘యూకే చారిటీ’ సంస్థల డేటాతో తమ సమాచారాన్ని అధ్యయనకారులు పోల్చి చూశారు.

2010లో దాతృత్వంలో భారత దేశ స్థానం 134 ఉండగా, గతేడాది గణనీయంగా 81 స్థానానికి చేరుకుంది. మళ్లీ ఈ ఏడాది ఒక స్థానం పెరిగి 82కు చేరుకుంది. అధ్యయన సంస్థ అన్ని విధాల లెక్కలేసి భారతీయులకు దాతృత్వంలో 26 శాతం మార్కులను కేటాయించింది. అదే అమెరికాకు అత్యధికంగా 58 శాతం మార్కులు ఇచ్చింది. ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన చైనా కేవలం 16 శాతం మార్కులతో  భారత్‌కన్నా ఎంతో వెనకబడింది. అపరిచుతులకు సహాయం చేయడం, డబ్బు దానం చేయడం, ఇతరుల సంక్షేమం కోసం స్వచ్ఛంగా సమయాన్ని కేటాయించడం.. మూడు కేటగిరీల్లో న్యూజిలాండ్‌ టాప్‌ టెన్‌లో నిలిచింది.

భారత్‌లో పేదవాడు, పేదవాడికే సహాయం ఎక్కువ చేస్తున్నారని, ధనికుల వద్ద 21 లక్షల కోట్ల రూపాయలు మూలుగుతున్న వారు పెద్దగా అపరిచితులకు సహాయం చేయడం లేదని కూడా ఈ అధ్యయనంలో తేలింది. ముస్లింలు అధికంగా ఉన్న ఇండోనేసియా కూడా టాప్‌ టెన్‌లో ఉంది. అందుకు కారణం ఇతరులకు దానం చేయాలనే సూక్తి వారి ఇస్లాంలో ఉండడం, దాన్ని అక్కడి ప్రజలు బలంగా నమ్మడం. చాలా దేశాల్లో దాన గుణం ఎక్కువ, తక్కువ ఉండడానికి కారణం వారి సంస్కృతులు, మత విశ్వాసాలు, వాటి పట్ల ప్రజలకున్న నమ్మకాలే కారణమని అధ్యయనం తేల్చింది.

మరిన్ని వార్తలు