ఉపసంహరణపై సమీక్షలు అవసరం: ఆర్మీ

17 Jul, 2020 04:38 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లోని క్లిష్టమైన తూర్పు లద్దాఖ్‌ ప్రాంతం నుంచి ఇరు దేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు ధ్రువీకరించుకోవాల్సిన అవసరం ఉందని భారత్‌ పేర్కొంది. ‘బలగాల పూర్తి ఉపసంహరణకు రెండు పక్షాలు కట్టుబడి ఉన్నాయి. క్లిష్టమైన ఈ ప్రక్రియ అమలుపై ఎప్పటికప్పుడు పరిశీలన అవసరం. దౌత్య, సైనిక స్థాయిల్లో ఇవి క్రమం తప్పకుండా జరుగుతుండాలి’ అని ఆర్మీ ప్రతినిధి కల్నల్‌ అమన్‌ ఆనంద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు లద్దాఖ్‌లో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునేందుకు కార్ప్స్‌ కమాండర్ల నాలుగో దఫా జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

మొదటి దశ ఉపసంహరణ ప్రక్రియ అమలును సమీక్షించడంతోపాటు పూర్తిస్థాయి ఉపసంహరణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా అధికారులు చర్చించారని తెలిపారు.  ‘అయితే, జూన్‌ 15వ తేదీ నాటి గల్వాన్‌ ఘటన నేపథ్యంలో పరస్పరం విశ్వాసం నెలకొనడానికి సమయం పడుతుంది. బలగాల సత్వర ఉపసంహరణ కూడా కష్టమే. పూర్తి స్థాయి ఉపసంహరణకు సైనిక స్థాయి చర్చలు మరికొన్ని జరగాల్సి ఉంది’ అని సీనియర్‌ అధికారి ఒకరు అన్నారు. అయిదో విడత లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి చర్చలు మరికొన్ని రోజుల్లోనే జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలంటున్నాయి. ఈసారి పాంగాంగో సో ప్రాంతం నుంచి ఉపసంహరణలపైనే ప్రధానంగా దృష్టి ఉంటుందని భావిస్తున్నారు.

ఘర్షణాత్మక పరిస్థితులను నివారించేందుకే
తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ  వెంట యుద్ధ పరిస్థితులను నివారించేందుకే రెండు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ‘క్లిష్టమైన ఈ ప్రక్రియకు సంబంధించి ఆధారాలు లేని, అసత్య వార్తలను పట్టించుకోవద్దంది. ఎల్‌ఏసీ వెంట రెగ్యులర్‌ పోస్టుల్లో తిరిగి బలగాలను మోహరించాలని కూడా నిర్ణయించాయని తెలిపింది. ఇది పరస్పర ఆమోదంతో తీసుకుంటున్న చర్య అనీ, దీనిని తప్పుగా అర్థం చేసుకోరాదని పేర్కొంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా