కరోనాపై తొలిసారిగా సర్వే

12 Jun, 2020 04:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లాక్‌డౌన్, నియంత్రణ చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి: కేంద్రం  

దేశంలో అత్యధిక జనాభాకు వైరస్‌ ముప్పు పొంచి ఉంది  

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా అమల్లోకి తీసుకొచ్చిన లాక్‌డౌన్, ప్రభుత్వం చేపట్టిన ఇతర నియంత్రణ చర్యలు సత్ఫలితాలను ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్‌–19 వ్యాప్తిపై దేశంలో తొలిసారిగా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. దేశంలో ఇప్పటికీ అత్యధిక జనాభాకు కరోనా ముప్పు పొంచి ఉన్నట్లు ఈ సర్వేలో తేలిందని కేంద్రం గురువారం తెలియజేసింది. అయితే, కరోనా సామాజిక వ్యాప్తి దశలోకి భారత్‌ ఇంకా చేరుకోలేదని తేల్చిచెప్పింది.

ఈ సర్వేలో రెండు భాగాలు ఉన్నాయి. మొదట సాధారణ జన సమూహంలో సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ వ్యాప్తి తీరును పరిశీలించారు. రెండో భాగంలో కంటైన్‌మెంట్‌ జోన్లు, హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఎవరెవరు ఈ మహమ్మారి బారినపడ్డారో గుర్తించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ చెప్పారు. రెండో భాగం సర్వే ఇంకా కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్యశాఖలు, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) భాగస్వామ్యంతో మే నెలలో దేశవ్యాప్తంగా సర్వే ప్రారంభించామని పేర్కొన్నారు.

► మొత్తం 83 జిల్లాల్లో 28,595 ఇళ్లల్లోని 26,400 మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు.

► ఇప్పటిదాకా 65 జిల్లాల సర్వే ఫలితాలను క్రోడీకరించారు. ఈ జిల్లాల్లో 0.73 శాతం జనాభా సార్స్‌–కోవ్‌–2 వైరస్‌ ప్రభావానికి గురైనట్లు తేలింది.  

► దేశంలో కరోనా వేగానికి అడ్డుకట్ట వేయడంలో, పాజిటివ్‌ కేసులను తగ్గించడంలో లాక్‌డౌన్, కంటైన్‌మెంట్‌ చర్యలు బాగా తోడ్పడ్డాయి.  

► గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే కరోనా ముప్పు పట్టణ ప్రాంతాల్లో 1.08 రెట్లు, పట్టణ మురికివాడల్లో 1.89 రెట్లు అధికం.  

► పట్టణ మురికివాడల్లో లాక్‌డౌన్‌ కొనసాగించాల్సిన అవసరం ఉంది.  

► కరోనా వైరస్‌ ప్రభావానికి అధికంగా గురయ్యే అవకాశం ఉన్న గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు మరింత అప్రమత్తంగా ఉండాలి.  

ఒక్కరోజులో 357 మరణాలు
 24 గంటల్లో 9,996 కేసులు
 మొత్తం కేసులు 2,86,579
మరణాలు 8,102

ఇండియాలో కరోనా మహమ్మారి విలయతాండవం నానాటికీ ఉధృతమవుతోంది. పాజిటివ్‌ కేసులు, మరణాలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య తొలిసారిగా 300 మార్కును దాటేసింది. బుధవారం నుంచి గురువారం వరకు 24 గంటల వ్యవధిలోనే 9,996 కేసులు బయటపడ్డాయి. 357 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. దేశంలో ఒక్కరోజులోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 2,86,579కు, మరణాలు 8,102కు చేరాయి.

రెండో రోజు కూడా యాక్టివ్‌ కరోనా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండడం కొంత సానుకూల పరిణామం. ప్రస్తుతం యాక్టివ్‌ కరోనా కేసులు 1,37,448 కాగా, 1,41,028 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. రికవరీ రేటు 49.21 శాతంగా నమోదైందని అధికార వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే తర్వాత భారత్‌ ఐదో స్థానానికి చేరింది. దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి కరోనా లక్షణాలు ఉన్నవారు, అనుమానితులు వెంటనే రాష్ట్రాల హెల్ప్‌లైన్‌ నంబర్ల ద్వారా అధికారులను సంప్రదించాలని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. అధికారుల సూచనల మేరకు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందాలన్నారు.

మరిన్ని వార్తలు