దేశం ధర్మసత్రం కాదు : రమణ్‌ సింగ్‌

3 Aug, 2018 19:34 IST|Sakshi
రమణ్‌ సింగ్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అక్రమంగా ప్రవేసించి నివశించడానికి భారతదేశం ధర్మసత్రం కాదని ఛత్తీస్‌ఘడ్‌ సీఎం రమణ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం  ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ అసోంలో నివసిస్తున్న 40 లక్షల మంది పేర్లను కేంద్రం పౌర జాబితా నుంచి తొలగించడాన్ని ఆయన సమర్ధించారు. దేశంలో ఉంటున్న వాళ్లు  గుర్తింపును నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని, ఇతర దేశస్తులకు నివాసం ఉండడానికి హక్కులేదని పేర్కొన్నారు. దేశ పౌరులుగా గుర్తింపబడినవారు దేశం నుంచి బహిష్కరణకు గురవుతారని అన్నారు.

భారత ప్రభుత్వం రూపొందించిన ఎన్‌ఆర్‌సీ చట్టం ఎనిమిదేళ్ల అసోం యువత పోరాటాలకు ఫలితమని వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం పౌర జాబితా నుంచి తొలగించిన 40లక్షల మంది భారతీయులుగా నిరూపించుకోవాలని, లేకపోతే దేశం విడిచి వెళ్లిపోవాలని పేర్కొన్నారు. కాగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఎన్‌సీఆర్‌ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను శుక్రవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీవ్రంగా ఖండించారు. ప్రజల్లో భయాందోళలను సృష్టించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు