ఉగ్రవాదులను ఏరివేయండి: భారత ప్రభుత్వం

25 Jul, 2019 20:35 IST|Sakshi

న్యూఢిల్లీ : తమ దేశంలో ప్రస్తుతం 30 నుంచి 40 వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించడాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. ఎట్టకేలకు పాక్‌లో ఉగ్రవాదులు ఉన్నారని అంగీకరించిన దాయాది దేశం... వారిని రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని హితవు పలికింది.  ఈ మేరకు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ...‘ పాక్‌లో ఉగ్రవాదుల శిక్షణా క్యాంపులు, ఉగ్రవాదులు ఉన్నారని... వాళ్లంతా కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు శిక్షణ తీసుకుంటున్నారని ఆ దేశ ప్రధాని అంగీకరించారు. కాబట్టి ఇప్పుడు టెర్రరిస్టు క్యాంపులపై దాడి చేసి, ఉగ్రవాదులను ఏరివేయడంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి’ అని వ్యాఖ్యానించారు.

కాగా యూఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పీస్‌ సంస్థ వాషింగ్టన్‌లో నిర్వహించిన సదస్సులో బుధవారం ఇమ్రాన్‌ మాట్లాడుతూ..‘నేను అధికారంలోకి వచ్చేవరకూ ఉగ్రవాదులపై చర్యలు తీసుకునే ధైర్యం అప్పటి ప్రభుత్వాలకు లేకపోయింది. పాకిస్తాన్‌లో ఉగ్రజాడ లేకుండా చేసేందుకే ఉగ్రవాద సంస్థల నుంచి ఆయుధాలు, విద్యాసంస్థలు, అంబులెన్సులు, ఆసుపత్రులు సహా ఆస్తులను తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. అదే విధంగా తమ దేశంలో దాదాపు 40,000 మంది ఉగ్రవాదులు ఉన్నారని, వీరంతా ఆఫ్గనిస్తాన్, కశ్మీర్‌లో పోరాడినవాళ్లేనని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ వాస్తవాలు అంగీకరించారంటూ వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఇమ్రాన్‌ వైఖరిని స్వాగతిస్తున్నామన్న రవీశ్‌ కుమార్‌.. పాక్‌తో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకుని... కుల్‌భూషణ్‌ జాధవ్‌ను విడుదల చేయాల్సిందిగా ఒత్తిడి పెంచుతామని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు