భారత్‌, పాక్‌ దగ్గరవుతాయిలా..

15 Mar, 2017 14:01 IST|Sakshi
భారత్‌, పాక్‌ దగ్గరవుతాయిలా..
బీజింగ్: షాంఘై కో-ఆపరేటీవ్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీవో)లో చేరిక ద్వారా భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య శుత్రుభావం తగ్గి మైత్రి వికసిస్తుందని చైనా అధికార పత్రిక పేర్కొంది. సుదీర్ఘంగా వైరి భావంతో ఉన్న ఈ రెండు దేశాల మధ్య ఎస్‌సీవో సభ్యత్వంతో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పెరిగి పరస్పర సహకార భావం పెంపొందుతుందని తన తాజా వ్యాసంలో చెప్పింది. చైనా రాజధాని బీజింగ్‌ కేంద్రంగా పనిచేసే ఎస్‌సీవో కూటమిలో ఈ రెండు దేశాల చేరికతో ఈ ప్రాంతంలో స్థిరత్వం, భద్రత పెరిగి ఆర్థిక ప్రగతితోపాటు ప్రాంతీయ ఆర్థిక సహకారం, సమగ్రతకు దారి తీస్తుందని పేర్కొంది.
 
ఎస్‌సీవోలో చైనా, రష్యా, కిర్గిస్తాన్‌, కజక్‌స్తాన్‌, తజికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ వ్యవస్థాపక సభ్య దేశాలు కాగా, ఆఫ్ఘనిస్తాన్‌, బెలారస్‌, భారత్‌, ఇరాన్‌, మంగోలియా, పాకిస్తాన్‌లు పరిశీలక దేశాలుగా ఉన్నాయి. 2015లో రష్యాలో జరిగిన సమావేశం భారత్‌, పాకిస్తాన్‌లను కూటమిలో చేర్చుకునేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని తీర్మానించారు. ఈ మేరకు ఈ ఏడాది జూన్‌లో కజక్‌స్తాన్‌ రాజధాని ఆస్తానాలో జరిగే ఎస్‌సీవో సమావేశంలో భారత్‌, పాకిస్తాన్‌ సభ్య దేశాలుగా మారనున్నాయి.
 
ఎస్‌సీవో సభ్యులుగా చేరడానికి రెండు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేయవలసి వస్తుంది. అందులో ఎస్‌సీవో చట్టాలకు లోబడి ఉండటంతో పాటు సరిహద్దు తగాదాల పరిష్కారం, తీవ్రవాదాన్ని నిర్మూలించటం వంటివి కూడా ఉంటాయి. వీటి కారణంగా ఆయా దేశాలు వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సివుంటుంది. అంతేకాదు, సభ్య దేశాల మధ్య ఏవైనా వివాదాలు ఏర్పడితే మరో సభ్య దేశం మధ్యవర్తిగా వ్యవహరించి పరిస్ధితిని చక్కదిద్దుతుంది. రెండు దేశాల మధ్య తగాదాలను పరిష్కరించటంతో ఎస్‌సీవో కీలకంగా మారనుందని ఆ పత్రిక వివరించింది. సభ్య దేశాలుగా మారిన తర్వాత భారత్‌, పాకిస్తాన్‌ విరోధాన్ని మరచి పరస్పర అభివృద్ధి దిశగా పయనిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
>
మరిన్ని వార్తలు