అసలు టార్గెట్‌ బహావల్‌పూరా?

28 Feb, 2019 04:46 IST|Sakshi
బహావల్‌పూర్‌లోని జైషే కార్యాలయం

పాకిస్తాన్‌ను స్థావరంగా చేసుకుని భారత్‌లో విధ్వంసం సృష్టిస్తున్న ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్,లష్కరే తొయిబాల ప్రధాన కేంద్రాలపై మొదట దాడి చేయాలని భారత్‌ భావించింది. బాలాకోట్‌ కంటే ముందు ఈ రెండు సంస్థలకు బహావల్‌పూర్, మురీదకే పట్టణాల్లో ఉన్న కార్యాలయాలపై దాడి చేసి నేలమట్టం చేయాలని తొలుత అనుకున్నారు. అయితే, ఈ రెండు సంస్థల కార్యాలయాలు బాగా కిక్కిరిసిన జనాభా ఉన్న ప్రాంతాల్లో ఉండటంతో భారత్‌ తన ఆలోచన మార్చుకుంది. దాడి చేస్తే జననష్టం అధికంగా ఉంటుంది, తద్వారా అంతర్జాతీయ సమాజం వేలెత్తి చూపే అవకాశం ఉండడంతో జనావాసాలకు దూరంగా ఉన్న బాలాకోట్‌ను భారత ప్రభుత్వం ఎంచుకుంది. అంతేకాకుండా బహావల్‌పూర్, మురీదకే పట్టణాలపై దాడి చేసి తిరిగి వచ్చేందుకు వైమానిక దళానికి అంత సురక్షితం కాదన్న ఆలోచన కూడా నిర్ణయం మారడానికి కారణమైంది.  

కన్‌ఫ్యూజ్‌ చేసి ఖతం చేశారు..
బాలాకోట్‌ పట్టణానికి సమీపంలోని జైషే మహ్మద్‌ శిక్షణ శిబిరాలపై దాడుల సమయంలో భారత వైమానిక దళం చాకచక్యంగా వ్యవహరించింది. భారత యుద్ధవిమానాలు ఎటు వెళ్తున్నాయో తెలుసుకునే వీల్లేకుండా వైమానిక యూనిట్లు వివిధ మార్గాల్లో వెళ్లడంతో పాక్‌ సైన్యం వెంటనే స్పందించలేకపోయింది. జైషే ప్రధాన కేంద్రం ఉన్న బహావల్‌పూర్‌ వైపు ఒక యూనిట్, లష్కరే తొయిబా కేంద్రం ఉన్న మురీదకే వైపు మరో యూనిట్‌ వెళ్లడంతో పాక్‌ వైమానిక దళాలు లాహోర్‌–సియాల్‌కోట్‌ సెక్టర్, ఓకడా–బహావల్‌పూర్‌ సెక్టర్‌లకు పరిమితమైపోయాయి. పాక్‌ వైమానిక దళాన్ని తప్పుదోవ పట్టించడంలో సఫలమయ్యారు. భారత వాయుసేన ప్రధాన యూనిట్‌ మాత్రం కేరన్‌–అతాముఖమ్‌ సరిహద్దు గుండా పాకిస్తాన్‌లో ప్రవేశించి బాలాకోట్‌పై దాడిచేశాయి. ఎక్కువ సంఖ్యలో యుద్ధవిమానాలు ఈ మూడో యూనిట్‌లోనే ఉన్నాయి. పాక్‌ వైమానిక దళం విషయం అర్థం చేసుకుని తేరుకునేలోపే ఈ మూడో యూనిట్‌ పని ముగించుకుని సురక్షితంగా వచ్చేసింది.  

ప్రధానితో ఉన్నతాధికారుల భేటీ
న్యూఢిల్లీ: పాక్‌ యుద్ధ విమానాలు భారత గగనతల ఉల్లంఘన కు పాల్పడిన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌తో పాటు నిఘా, త్రివిధ దళాల ఉన్నతాధికారులు ప్రధాని మోదీతో భేటీఅయ్యారు. బాలాకోట్‌ స్థావ రంపై ఐఏఎఫ్‌ దాడి అనంతరం నెలకొన్న పరిస్థితిని ఆయనకు వివరించారు. మిగ్‌–21 ఫైటర్‌జెట్‌ను పాక్‌ నేలకూల్చిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను అరెస్ట్‌ చేసినట్లు పాక్‌ ప్రకటించడంపై కూడా చర్చించారు.

షోపియాన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతాబలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌ లో జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని మీమెందర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్ర తా బలగాలు బుధవారం ఉదయం తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులకు దిగారని.. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారని అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు షోపియన్‌ ప్రాంతానికి చెందిన సుహైల్‌ నజీర్‌ కాగా, మరొకరిని పాక్‌ పౌరుడిగా గుర్తించారు.

పాక్‌ అండతోనే జైషే ‘పుల్వామా దాడి’
వూజెన్‌(చైనా): జైషే మహ్మద్‌ను పాకిస్తాన్‌ వెనకేసుకురావడంతోనే పుల్వామా ఉగ్రదాడి సాధ్యమైందని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ అన్నారు. భారత్, రష్యా, చైనా విదేశాంగ మంత్రుల సమావేశం కోసం సుష్మా బుధవారం చైనాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో సమావేశమయ్యారు. భేటీలో పుల్వామా ఉగ్రదాడి అంశాన్ని లేవనెత్తారు. భారత్‌ తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో చైనాకు రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్‌ ప్రధాన స్థావరంగా, పాక్‌ ప్రోత్సాహంతోనే జైషే మహ్మద్‌ ఈ దాడికి పాల్పడిందని వివరించారు. దాడిని ఐరాస సభ్యదేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు తగిన సమయమని సుష్మా అన్నారు. గతేడాది మోదీతో భేటీ.. ద్వైపాక్షిక బంధాన్ని మరింత దృఢం చేసిందని వాంగ్‌ యీ చెప్పారు.

పాక్‌ పన్నాగాన్ని తిప్పికొట్టారిలా..
బుధవారం ఉదయం 9.58 గంటలకు మూడు పాకిస్తాన్‌ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి చొరబడ్డాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అందులో జేఎఫ్‌–17, ఎఫ్‌–16 లాంటి శక్తిమంతమైన విమానాలు ఉన్నాయి. క్రిష్ణగాటి, నంగి తేక్రిలోని ఆర్మీ స్థావరాలు, నారియన్‌లోని ఆయుధాగారాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ విమానాలు దాడులకు దిగాయి. అవి జారవిడిచిన బాంబులు జనావాసాలకు దూరంగా పడటంతో ప్రాణనష్టం తప్పింది. వెంటనే స్పందించిన భారత వైమానిక దళం ప్రతీకార దాడులు ప్రారంభించింది. మిగ్‌–21, ఇతర యుద్ధ విమానాలతో ప్రత్యర్థికి దీటైన జవాబిచ్చింది. నౌషెరా, రాజౌరీలలోని కీలక స్థావరాలకు నష్టం కలగకుండా నిరోధించగలిగింది. మిగ్‌–21 బైసన్‌ విమానం కుప్పకూలే ముందు గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులతో పాకిస్తాన్‌ విమానం ఎఫ్‌–16ను నేలకూల్చింది. మన విమానాన్ని పాకిస్తాన్‌ విమానమే పేల్చి వేసిందా? లేదా క్షిపణితో దాడి చేశారా? అన్నది తెలియరాలేదు. ఉదయం 10.45 గంటలకు మిషన్‌ ముగిశాక అభినందన్‌ తప్ప మిగిలిన సిబ్బంది క్షేమంగా తిరిగొచ్చారు.   

మరిన్ని వార్తలు