చైనా కంపెనీలపై భారత్‌ కఠిన ఆంక్షలు!

17 Jun, 2020 16:45 IST|Sakshi
చైనాపై భారతీయుల ఆగ్రహం

న్యూఢిల్లీ: ల‌ద్దాఖ్‌‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో జరిగిన దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో చైనాపై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నట్లు సమాచారం. సోమవారం రాత్రి జరిగిన ఘటనతో ప్రస్తుతం భారతదేశంలోని చైనా వ్యాపారాలు, ప్రాజెక్టులు ఇబ్బందులు ఎదుర్కొబోతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు వివాదం నేపథ్యంలో గతంలో చైనా వస్తువులను నిషేధించాలని పిలుపునిచ్చిన భారత పౌరులను ప్రభుత్వం శాంతింపజేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా 20 మంది భారతీయ సైనికులు మరణించడంతో ప్రభుత్వ వైఖరిలో మార్పు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.  ఈ క్రమంలో చైనాపై రెండు అంచెల ఆర్థిక ప్రతీకారానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 

ప్రత్యక్ష్య చర్య
మొదటగా ప్రత్యక్ష్య చర్యలో భాగంగా ఇక మీదట భారత్‌ ప్రాజెక్టులను చైనా కంపెనీలకు కేటాయించకూడదని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దాంతో చైనా కంపెనీల వాటాలు ఇబ్బందుల్లో పడతాయి. ఇప్పటికే కేటాయింపులు పూర్తైన ప్రాజెక్ట్‌ల విషయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. ఈ చర్యల వల్ల మొదటగా ఇబ్బంది ఎదుర్కొనే చైనా కంపెనీ షాంగై టన్నెల్‌ ఇంజనీరింగ్‌ కో లిమిటెడ్‌(ఎస్‌టీఈసీ). ఈ కంపెనీ ఇప్పటికే ఢిల్లీ-మీరట్ ఆర్‌ఆర్‌టీఎస్ (రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) ప్రాజెక్ట్‌ కోసం బిడ్‌ వేసింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం చైనా కంపెనీ అవకాశాలను దెబ్బతీసే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారి ఆంగ్ల మీడియాకు వెల్లడించారు. (చైనా కుయుక్తులకు సాక్ష్యమీ ఫొటోలు!

ఢిల్లీ-మీరట్ ఆర్‌ఆర్‌టీఎస్ ప్రాజెక్టును నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(ఎన్‌సీఆర్‌టీసీ) నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ న్యూ అశోక్ నగర్, సాహిబాబాద్ మధ్య 5.6 కిలోమీటర్ల భూగర్భ విభాగానికి చెందిన నిర్మాణం. ఐదు భారతీయ, బహుళజాతి కంపెనీలు ఈ ప్రాజెక్టు కోసం తమ బిడ్లను సమర్పించాయి. ఎన్‌సీఆర్‌టీసీ ప్రకారం.. ఎస్‌టీఈసీ ఈ ప్రాజెక్ట్‌ కోసం- 1,126 కోట్ల రూపాయలను ఉటంకిస్తూ L-1 గా అర్హత సాధించింది. భారతీయ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ రూ.1,170 కోట్లు కోట్ చేసి ఎల్ -2గా నిలిచినట్లు తెలిసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రాజెక్ట్‌ టెండరింగ్ నవంబర్‌లో జరగగా.. ఇండో-చైనా సరిహద్దు వివాదం గరిష్ట స్థాయికి చేరిన తర్వాత జూన్‌లో ఆర్థిక బిడ్లు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో చైనా కంపెనీ ఎల్‌-1గా నిలవడం పట్ల ప్రతిపక్షాలతో సహా, ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా వ్యతిరేకత తెలిపింది. (జవాన్ల మధ్య ఘర్షణకి కారణం ఏంటంటే..

దేశీయ కంపెనీలకు అవకాశం కల్పించడం
ప్రాజెక్ట్‌ టెండరింగ్‌ అంశంలో భారత్‌ నిబంధనలను కఠినతరం చేస్తే.. స్వదేశీ కంపెనీలపై ఆ ప్రభావం పడుతుంది. ఇప్పటికే గతంలో పలు చైనా దిగ్గజ కంపెనీలు అతి తక్కువకు కోట్‌ చేస్తూ దేశీయ కంపెనీలకు పోటీగా నిలిచాయి. ఈ క్రమంలో ఓ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ.. ‘దేశీయ కంపెనీలు ఈ ప్రాజెక్ట్‌లను దక్కించుకునేందుకు వీలుగా నియమాలను మార్చబోతున్నారు. టెండర్ల విషయంలో అమలు చేసే టెక్నికల్‌ నిబంధనలను మరోసారి సమీక్షించనున్నారు. అదే విధంగా బిడ్లలో చైనా కంపెనీలను గుర్తించేలా మార్పులు చేయబోతున్నారు. అలానే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజీనెస్‌లో భాగంగా చైనాకు కల్పించిన అవకాశాలను తగ్గించాలని’ చూస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌ సరిహద్దు దేశాల ఎఫ్‌డీఐ నిబంధనలను సవరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు