లాక్‌డౌన్‌.. స్ఫూర్తిని వీడని పోస్టల్‌ శాఖ

27 Apr, 2020 14:38 IST|Sakshi

న్యూఢిల్లీ : ఓవైపు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా భారత తపాలా శాఖ పూర్తి స్థాయిలో సేవలను అందిస్తోంది. క్షేత్ర స్థాయిలో సేవలు అందిస్తూ స్ఫూర్తి కొనసాగిస్తుంది. ప్ర‌స్తుత త‌రుణంలో త‌పాలా సేవ‌లు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ప్ర‌జ‌ల‌కు ఇంటి వద్దే బ్యాంక్‌లో ఉన్న డబ్బును ఉపసంహరించుకునే సౌలభ్యం, గ్రామీణ డాక్ సేవల‌తో సహా  వివిధ విధులను పోస్టల్ ఉద్యోగులు నిర్వర్తిస్తున్నారు. వీటికి తోడు అవసరమైన చోట్ల మెడిసిన్‌, ఆహార పొట్లాలు, అవసరమైన సరుకులు కూడా సరఫరా చేస్తున్నారు. కష్టకాలంలో పేదలకు చేయూతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం అందజేసిన సబ్సిడీలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. మరోవైపు కరోనా వేళ సేవలు అందిస్తున్న తపాలా శాఖ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో విధుల‌ను నిర్వ‌హిస్తున్న ఉద్యోగులు ఈ వైర‌స్ బారిన ప‌డి మ‌ర‌ణిస్తే రూ.ప‌ది ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

లాక్‌డౌన్‌లో ఏప్రిల్‌ 25వరకు పోస్టల్‌ శాఖ అందజేసిన సేవలు..

  • రూ. 452 కోట్లు విలువచేసే 23 లక్షలకు పైగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ లావాదేవీలు
  • రూ. 700 కోట్లు విలువచేసే 74.6 లక్షల డీబీటీ(ప్రత్యక్ష నగదు బదిలీ) పేమెంట్స్‌ అందజేత
  • రూ. 33,000 కోట్లు విలువచేసే 2.3 కోట్ల పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ లావాదేవీలు, రూ. 2,600 కోట్లు విలువచేసే ఒక కోటి ఐపీపీబీ(ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్) లావాదేవీలు
  • 42.5 లక్షల లేఖలు, రూ. 355 కోట్లు విలువచేసే 31.5 లక్షల మనీ ఆర్డర్స్‌ వినియోగదారులకు అందజేత
మరిన్ని వార్తలు