ఉడీ ముష్కరులు మీవాళ్లే...

22 Sep, 2016 08:43 IST|Sakshi
ఉడీ ముష్కరులు మీవాళ్లే...

ఉగ్రదాడిపై పాక్‌కు సాక్ష్యాలు అందించిన భారత్
- పాక్ హైకమిషనర్ బాసిత్‌ను పిలిపించిన విదేశాంగ కార్యదర్శి జైశంకర్
- ఉగ్ర జీపీఎస్ సమాచారం, పాక్ తయారీ వస్తువుల వివరాల అందజేత
- మీతో మాట్లాడుతుండగానే ఎల్‌ఓసీ వద్ద కాల్పుల ఉల్లంఘనలు
- భద్రతపై కేబినెట్ కమిటీతో ప్రధాని భేటీ.. బీజేపీ నేతలతోనూ భేటీ
 
 న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా దౌత్యపర ఒత్తిడిని భారత్ తీవ్రం చేసింది. విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ బుధవారం పాక్ హైకమిషనర్ అబ్దుల్‌బాసిత్‌ను పిలిపించి మాట్లాడారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు క్రియాశీలంగా ఉన్నాయని  ఉడీ ఉగ్రదాడి స్పష్టం చేస్తోందన్నారు. ఆ దాడిలో పాక్‌లోని ఉగ్రవాదుల ప్రమేయానికి సంబంధించి స్వాధీనం చేసుకున్న సాక్ష్యాధారాలను ఆ దేశం దృష్టికి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల మృతదేహాల నుంచి స్వాధీనం చేసుకున్న జీపీఎస్ పరికరాల్లో.. నియంత్రణ రేఖ వెంట ఆ ముష్కరులు చొరబడిన ప్రదేశం, సమయం, ఆ తర్వాత వారు దాడి చేసిన ప్రాంతానికి చేరుకున్న మార్గం సమాచారాన్ని బాసిత్‌కు వివరించారు.

ఉగ్రవాదులు వాడిన గ్రెనేడ్లపై కూడా పాక్ గుర్తులు ఉన్నాయని చూపుతూ.. ఇవి ఉడీ దాడిలో పాక్ ప్రమేయాన్ని సూచిస్తున్నాయని చెప్పారు. ఈ సీమాంతర దాడులపై పాక్ ప్రభుత్వం దర్యాప్తు చేయాలని భావిస్తే.. ఉడీ, పూంచ్ సెక్టార్లలో హతమైన ఉగ్రవాదుల వేలిముద్రలు, డీఎన్‌ఏ నమూనాలను అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు.  భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు తమ భూభాగాన్ని వినియోగించడానికి అనుమతించబోమని పాక్ 2004 జనవరిలో ఇచ్చిన హామీని గుర్తుచేశారు. ఆ హామీని తరచుగా, అధికంగా ఉల్లంఘించటం తీవ్ర ఆందోళనకరమైన విషయమని ఆక్షేపించారు. తాను పాక్ హైకమిషనర్‌తో మాట్లాడుతున్న సమయంలోనే నియంత్రణ రేఖ వద్ద పాక్ వైపు నుంచి రెండు చోట్ల కాల్పుల ఉల్లంఘనలు కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదుల నుండి జీపీఎస్ వివరాలతో పాటు, సమాచార వివరాల పత్రాలు, పరికరాలు, ఆహారం, మందులు, దుస్తులు వంటి పాక్‌లో తయారైన వస్తువులనూ భారత్ స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఆయనకు తెలిపారు. దీనిపై పాక్ ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.

 మోదీ సీసీఎస్ భేటీ...మరోవైపు.. పాక్‌పై కఠిన చర్య చేపట్టాలన్న పిలుపుల నేపథ్యంలో.. ప్రధానమంత్రి మోదీ బుధవారం భద్రతపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) భేటీ నిర్వహించారు. ఆదివారం 18 మంది జవాన్లను బలితీసుకున్న ఉగ్రదాడికి ప్రతిస్పందనలపై బేరీజు వేశారు. బీజేపీ అగ్రనేతలతోనూ మోదీ ఆంతరంగికంగా భేటీ అయ్యారు. ఉడీ ఉగ్రదాడి కారకులను శిక్షించే విషయాన్ని ప్రభుత్వంతీవ్రంగా పరిగణిస్తోందని, సరిహద్దుకు ఆవలి నుండి భారత్‌లోకి ఉగ్రవాదాన్ని చొప్పిస్తోంటే సర్కారు నిద్రపోదని రక్షణమంత్రి పరీకర్ పేర్కొన్నారు. ‘బాధ్యులైన వారిని శిక్షిస్తాం’ అన్న ప్రధాని మాటలు కేవలం ప్రకటనగానే ఉండిపోతుందని భావించటం లేదన్నారు. ఎలా శిక్షించాలో నిర్ణయించాల్సింది తామని అన్నారు. ఈ ఏడాది పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడితో మొదలుపెట్టి భారత్‌పై దాడి చేయడం కోసం నియంత్రణరేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంట ఉగ్రవాదుల చొరబాట్లకు నిరంతరం యత్నాలు సాగుతున్నాయని.. అందులో 31 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.  

 రెండు చోట్ల కంచె కత్తిరింపు
 ఉడీ: ఉడీలో ఆర్మీ బేస్ క్యాంపుపై దాడి చేసి 18 మంది సైనికుల మరణానికి కారణమైన నలుగురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెంది న వారే అని దర్యాప్తులో వెల్లడైంది. వీరు ఆర్మీ బేస్‌ను ఆనుకుని ఉన్న కంచెను రెండు చోట్ల కత్తిరించి లోపలికి చొరబడినట్టు తేలింది. వాస్తవాధీన రేఖకు ఆనుకుని ఉన్న ఈ ఆర్మీ బేస్ లేఅవుట్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు స్టోర్ రూమ్, కిచెన్‌లోకి వెళ్లి దాక్కున్నారని, భద్రతాసిబ్బంది నుంచి తప్పించుకునేందుకు వాటిని తగులబెట్టడంతో మంటలు చెలరేగాయని సమాచారం.
 
 గాలింపు ముమ్మరం

 ఉడీ: కశ్మీర్ వాస్తవాధీన రేఖ(ఎల్‌వోసీ) వద్దనున్న ఉడీ, నౌగామ్ సెక్టార్లలో భారత జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. వాతావరణం బాగాలేనప్పటికీ రెండోరోజు బుధవారం కూడా గాలింపు కొనసాగిస్తున్నట్లు ఆర్మీ  ప్రకటించింది. ఉడీ దాడి జరిగిన తర్వాత భారత భద్రతా బలగాలు పదిమంది ఉగ్రవాదులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదుల మృతదేహాల కోసం సైనికులు గాలిస్తున్నారు. నియంత్రణ రేఖకు 300 మీటర్ల దూరంలో మిలిటెంట్ల మృతదేహాలను భారత జవాన్లు గుర్తించారు. మరోపక్క.. భద్రతా దళాలు త్రాల్‌లో మిలిటెంట్ శిబిరాన్ని గుర్తించి అందులోని ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం కార్యదర్శి రాజీవ్ మహ ర్షి, రాష్ట్రంలో పరిస్థితిని కేంద్ర హోం  మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు.

మరిన్ని వార్తలు