సహజవాయువు ధరలు పైపైకి

30 Mar, 2018 02:26 IST|Sakshi

పైప్డ్‌ వంటగ్యాస్, సీఎన్జీ ధరలపైనా ప్రభావం

న్యూఢిల్లీ: దేశంలో ఉత్పత్తయ్యే సహజవాయువు ధరలను కేంద్రం భారీగా పెంచింది. దీంతో పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా అయ్యే వంట గ్యాస్‌ వినియోగదారుల జేబులు గుల్ల కానుండగా ఓఎన్జీసీ, ఆయిల్‌ ఇండియా, రిలయెన్స్‌ గ్యాస్‌ ఇండస్ట్రీస్‌కు మాత్రం లాభాలు రానున్నాయి. గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా దేశీయ సహజవాయువు ధరను అమాంతం ఆరు శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ విభాగం గురువారం ఒక సర్క్యులర్‌ జారీ చేసింది.

దీని ప్రకారం.. మిలియన్‌ మెట్రిక్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌(ఎంఎంబీటీయూ)గ్యాస్‌కు 3.06 డాలర్లు చొప్పున ధర పెరుగనుంది. అధిక లోతు, అధిక వేడి, అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి వెలికితీసే గ్యాస్‌ ధరను 9 శాతం అంటే ఎంఎంబీటీయూకు 6.78 డాలర్ల చొప్పున పెంచింది. ఈ ధరలు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్‌ వరకు ఆరు నెలలపాటు అమల్లో ఉంటాయి. 2014 నవంబర్‌ నుంచి అమల్లోకి వచ్చిన విధానం ప్రకారం.. కేంద్రం అంతర్జాతీయ మార్కెట్‌ ధరలననుసరించి ఆరు నెలలకోసారి సహజవాయువు ధరలను సవరిస్తోంది.

మరిన్ని వార్తలు