24 గంటల్లో 7,964 కేసులు

31 May, 2020 04:38 IST|Sakshi

దేశంలో 24 గంటల్లో 265 మరణాలు

ఇప్పటిదాకా మొత్తం కేసులు 1,73,763.. మరణాలు 4,971

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరిగిపోతోంది. కరోనా పాజిటివ్‌ కేసులు 2 లక్షలకు, మరణాలు 5 వేలకు చేరువవుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కేవలం 24 గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 7,964 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 265 మంది బాధితులు కన్నుమూశారు. దేశంలో ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి.

భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 1,73,763కు, మరణాలు 4,971కి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం క్రియాశీల కరోనా కేసులు 86,422 కాగా, ఇప్పటివరకు 82,369 మంది బాధితులు చికిత్స అనంతరం కోలుకున్నారు. గత 24 గంటల్లో 11,264 మంది కోలుకున్నారు. ఇప్పటిదాకా ఒకరోజులో కోలుకున్నవారిలో ఇదే గరిష్టం. ఇండియాలో రికవరీ రేటు 47.40 శాతానికి పెరగడం ఎంతో ఊరట కలిగిస్తోంది.

15.4 రోజుల్లో కేసులు రెట్టింపు  
దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపయ్యే వ్యవధి ప్రస్తుతం 15.4 రోజులకు పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. గత మూడు రోజులుగా పరిస్థితి మెరుగు పడుతోందని తెలియజేసింది. కరోనా సంబంధిత మరణాల రేటు 2.86 శాతంగా ఉందని పేర్కొంది. యాక్టివ్‌ కరోనా కేసులు తగ్గిపోతున్నాయని తెలిపింది. ఇప్పటిదాకా దేశంలో 36,12,242 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది. అలాగే 119.88 లక్షల ఎన్‌95 మాస్కులు, 96.14 లక్షల పీపీఈ కిట్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిణీ చేసినట్లు వివరించింది.

పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌ క్రిమిరహితం  
ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో తాజాగా నాలుగో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లోని అన్ని భవనాలను రసాయనాలతో క్రిమిరహితం(శానిటైజ్‌) చేశారు. తొలుత మార్చి 21న, ఆ తర్వాత పలుమార్లు ఇలాంటి ప్రక్రియ చేపట్టారు.

మరిన్ని వార్తలు